మార్కెట్లోకి అప్పుడే నిగనిగలాడే మామిడి పండ్లు వచ్చాయని సంబరపడుతున్నారా.. జాగ్రత్త అవి కృత్రిమ పదార్ధాలతో పండించిన మామిడి పండ్లు కావచ్చు. ఎందుకంటే.. నిషేధిత పదార్థాలతో... కృత్రిమంగా మామిడికాయలను మగ్గపెడుతున్న నిందితులను తాజాగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి హైదరాబాద్ నగరంలోని పలు షాప్‌లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేశారు.
మంగళ్‌హట్‌కు చెందిన రామేశ్వర్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్ ఖాన్, అఘాపురకు చెందిన హుస్సేన్, ఎంఎం పహాడికి చెందిన సయ్యద్ జహూర్, చార్మినార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మస్తాన్, భవాని నగర్‌కు చెందిన సయ్యద్ అస్లామ్, మొఘల్‌పురకు చెందిన సయ్యద్ షాదుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెట్టిన మామిడికాయలు తినడం వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆహార భద్రతా అధికారులు చెబుతున్నారు. నిందితుల వద్ద నుంచి దాదాపుగా 12 లక్షలు విలువ చేసే మామిడి కాయలను సీజ్ చేశారు.