రైలు రోకో సందర్భంగా తనపై నమోదు చేసిన కేసు విషయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలంటూ పిటిషన్లో కేసీఆర్ కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రైల్ రోకోకు కెసిఆర్ పిలుపునిచ్చారంటూ కోర్టుకు మల్కాజ్గిరి పోలీసులు నివేదిక ఇచ్చారు. రైలు రోకో వల్ల రైలు రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని నివేదికలో పోలీసులు తెలిపారు.
అయితే తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని.. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారంటూ కేసీఆర్ వాదిస్తున్నారు. ఆ ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందని, ఈ దశలో కేసు నమోదు చేయడం సరైంది కాదని కేసీఆర్ తన పిటిషన్ లో తెలిపారు. అందుకే కేసు కొట్టేయాలని కోరారు.