2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీఇచ్చారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు, విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం వంటివి ప్రకటించారు.కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడం పట్ల మంత్రి నారా లోకేశ్ స్పందించారు.‘‘ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్ కొత్త సూర్యోదయాన్ని చూసింది. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు నేను చాలా సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏపీ అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఈప్రకటనలు సహాయపడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర రాజధాని ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం గొప్ప విషయం. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణం. పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, హెచ్‌ఆర్‌డీ వంటి ముఖ్య రంగాలను కవర్ చేస్తూ ప్రత్యేక, సమగ్ర ప్యాకేజీని రాష్ట్రానికి కేంద్రం అందిస్తుంది.
అమరావతి, పోలవరానికి కేంద్ర సర్కారు ఉదారంగా సహకారాన్ని అందించబోతోంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రెడ్ లెటర్ డే లాంటిది. కలల ఏపీ రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి ఇదితొలి అడుగు’’ అని ఏపీ మంత్రి, టీడీపీ అగ్రనేత నారా లోకేష్ పేర్కొన్నారు.కేంద్ర బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీ ప్రజల తరుఫున కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.కాగా ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే జగన్ ప్రభుత్వ పాలనలో గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలకు, అదే విధంగా ప్రస్తుతం టీడీపీ పాలనలో రాష్ట్రాభివృద్ది కోసం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రులు సోదాహరణగా వివరిస్తున్నారు.