అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీ ప్రమాదంలో బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆయన.. నేరుగా మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రమాద క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని.. అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు.. భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల కుటుంబసభ్యులతో కూడా మాట్లాడారు.. వారికి ధైర్యం చెప్పారు. అచ్యుతాపురం ఏపీ సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా అనే కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలో భద్రత ఏ స్థాయిలో ఉందో, ప్రమాదానికి గల కారణాలతో పూర్తి నివేదిక పరిశీలిస్తామని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాకుండా ప్రజల భద్రత కూడా తమకు ప్రథమ ప్రాధాన్యం అని అన్నారు. రెడ్ కేటగిరి పరిశ్రమలు తప్పకుండా సేఫ్టీ అడిట్ జరిపించాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమల నిర్వహణపై కూడా ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తున్నామని అన్నారు. గత ఐదేళ్లుగా పరిశ్రమలను జగన్ ప్రభుత్వం లూటీ చేసిందని.. అందుకే ప్రమాదాలు ఎక్కువయ్యాయని అన్నారు.
ఎంక్వైరీ కమిటీ రిపోర్టు ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.
అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదం విషయంలో కూడా ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఎసెన్సియా ఫార్మా కంపెనీ రెడ్ కేటగిరీ ఫ్యాక్టరీ అని.. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారని అన్నారు. గత 5 ఏళ్లలో ఉమ్మడి విశాఖలో ఫ్యాక్టరీల్లో 119 ప్రమాదాలు జరిగాయని.. ఆ ఘటనల్లో 120 మంది మృతి చెందారని అన్నారు. నాలుగేళ్ల క్రితం ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో విషవాయువులు లీకైన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అది అంత తీవ్రత ఉన్న విషవాయువు కానప్పటికీ ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించామని.. నష్టం మాత్రం జరిగిందని అన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ ఘటనలో హైపవర్ కమిటీ వేసినా.. చర్యలు మాత్రం లేవని అన్నారు.
ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు చంద్రబాబు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా.. 35మందికిపైగా గాయాలయ్యాయని.. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారన్నారు. ఆస్పత్రుల్లో ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలందిస్తామని.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామన్నారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లోనూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు.. స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.