తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించిన టీజీ డీఎస్సీ 2024 పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా ఎస్జీటీ పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అయితే ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలైంది. అప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలతో ముగిసింది.అయితే ఎప్పుడూ లేని విధంగా విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం. ఈసారి ప్రాథమిక ‘కీ’ని సవాల్ చేస్తూ దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీలను ఆగస్టు 13వ తేదీన విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఆగస్టు నెలాఖరులో ఫైనల్‌కీ, ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది.ఇదిలావుండగా తెలంగాణ ప్రభుత్వం మరో డిఎస్సి పై కసరత్తు చేస్తున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఇటీవల 11, 062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం మరో డిఎస్సి కి కసరత్తు చేస్తుంది. డిసెంబర్, జనవరి నెలలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్, జూలైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంత మంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరిస్తుంది. ఈ సమాచారం పూర్తయిన తర్వాత డీఎస్సీ పై ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.