ఏపీ: వాలంటీర్ వ్యవస్థను గుర్తు చేసిన మాజీ సీఎం..?

FARMANULLA SHAIK
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా.. పాలకులు, ప్రజలు ఊహించని రీతిలో కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణుకుతోంది.దీంతో రెండు రోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు..అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి వరద ప్రభావిత బాధితులను పరామర్శించిన సీఎం.. కొద్దిసేపటికే మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలు నచ్చకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు బయలు దేరాడు.దీంతో సీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేకుండా సీఎం పర్యటనకు వస్తుండటంతో అధికారులు ఉరుకులు పెడుతున్నారు. కాగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. ఓ వైపు కృష్ణ.. మరోవైపు బుడమేరు ఉప్పొంగడంతో బెజవాడ పట్టణంలోని అనేక కాలనీలు నీటిలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలను చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాగే, వరద బాధితులను ఆదుకోవడంలో కూడా కూటమి సర్కార్‌ విఫలమైందన్నారు.వర్షాలపై ప్రభుత్వం సరైన ప్లాన్‌ చేసి ఉంటే ఇంత తీవ్ర పరిస్థితులు ఉండేవి కాదని చెప్పుకొచ్చారు.తమ ప్రభుత్వం ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా బాధితులను ఆదుకున్నామని మాజీ సీఎం జగన్ తెలిపారు. గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినా గ్రామ వార్డు స్థాయిలో వాలంటీర్ సహాయ సహకారాల వల్ల ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పాలించాం. విపత్తు కంటే ముందే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించాం.వారిని ఇళ్లకు పంపేటప్పుడు కుటుంబానికి రూ.2000 ఇచ్చామని వివరించారు.మానవ తప్పిదం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వరద ప్రభావితానికి గురైన విజయవాడ సింగ్‌నగర్‌లో ఆయన పర్యటించారు.వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. వరద సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలను అప్రమత్తం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే ఇంత ముంపు ఉండేదికాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: