తెలుగు రాష్ట్రాల కోసం నేను సైతం అంటున్న మహేష్..!

FARMANULLA SHAIK
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ అతాలకుతలమయ్యాయి. భారీ వర్షాల కు వరద పోటెత్తింది. వరదకు తెలంగాణ లోని ఖమ్మం తో పాటు ఏపీ లోని విజయవాడ సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో జనమంతా ఉన్న ఇండ్లను వదిలి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. తినేందుకు సరైన తిండి, తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారు. మరో వైపు వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు టాలీవుడ్‌ నటీనటులు ముందుకువచ్చారు.ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా ముందుగా స్పందించేది టాలీవుడ్ పరిశ్రమే. ఈసారి కూడా సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు నుండి బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలెందరో ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ప్రకటిస్తున్నారు. తాజా గా సూపర్ స్టార్ మహేష్ బాబు ..రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు.రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌ కు రూ.50లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం.. ఈ ప్రయత్నాని కి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నానని మహేష్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ రెండు రాష్ట్రాలకు రూ.50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ. 50 లక్షల విరాళం అందించారు.అలాగే, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ రూ.50లక్షలు, హీరో జొన్నగడ్డల సిద్ధు రూ.15లక్షల చొప్పున, విశ్వక్‌సేన్‌ రూ.5లక్షల చొప్పున ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.కోటి, అశ్వనీదత్‌ రూ.25లక్షలు, నటి అనన్య నాగళ్ల రూ.5లక్షలు విరాళం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: