ఫైర్ బ్రాండ్ చింతమనేని మంచి మనసు...? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే..?
ఏపీ రాజకీయాల్లో చింతమనేని ప్రభాకర్ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేవి ఆయన దూకుడు వ్యాఖ్యలు, ప్రత్యర్థులపై విమర్శలు, అధికారులపై దాడులు.. కానీ తాజాగా ఆయన చేసిన ఓ పని మాత్రం రాజకీయ నాయకుల నుంచే కాదు సాధారణ ప్రజల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది.ఇంకా చెప్పాలంటే చింతమనేని ప్రభాకర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా ఉందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. అంతలా చింతమనేని ఏం చేశారో తెలుసా ?
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు వివిధ సందర్భాల్లో రాజకీయ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన శాలువాల్ని పోగేసి వాటిని బట్టలుగా కుట్టించి పేద పిల్లలకు పంచారు. గివ్ బ్యాక్ అనే కార్యక్రమం ప్రారంభించిన చింతమనేని ప్రభాకర్.. తనను అభినందించడానికి తెచ్చే శాలువాల్ని భద్రపరిచి, హాస్టళ్లు, స్కూళ్లలో పిల్లలకు బట్టలుగా కుట్టించి పంచుతున్నారు. ఒక్కో జతకు రూ.400 రూపాయలు చొప్పున ఖర్చుపెట్టి 200 మంది పిల్లలకు పంచుతున్నట్లు చింతమనేని వెల్లడించారు.
తనలాగే ఇతర రాజకీయ నేతలు కూడా తమకు వచ్చిన శాలువాల్ని ఇలా కేవలం 450 ఖర్చుపెట్టి బట్టలుగా కుట్టించి ఇస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. క్రిస్మస్ నాటికి ఇలా తయారు చేసిన బట్టల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా కొట్టించిన బట్టలపై ఆయా పేద పిల్లలకు చింతమనేని ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలైన ఆయన కూతురు నవ్య తెలిపారు