పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంగించడంపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా డీజీఎంవో రాజీవ్ ఘాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసిందన్నారు. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్పారు. 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని, అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటివారికి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడి చేశామన్నారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు వెల్లడించారు.
ఉగ్రవాద శిబిరాలపై దాడిని వీడియో తీసి విడుదల చేశామని, 9 ఉగ్రవాద శిబిరాల్లో వంద మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయారన్నారు. పాకిస్తాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. టార్గెట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసి అటాక్ చేశామని, సరిహద్దుకు దగ్గర మురిద్కేలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తొలిదాడి చేశామని చెప్పారు. మురిద్కేలో 4 టార్గెట్స్‌పై కచ్చితత్వంతో దాడి చేశామని, డ్రోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను భారత భూభాగంపై పాక్ ప్రయోగించిందన్నారు. 8,9 తేదీల్లో శ్రీనగర్ నుంచి నలియా వరకు డ్రోన్లతో దాడి చేశారని చెప్పారు. పాక్ డ్రోన్లు, UAVల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. ఉగ్రవాదులు, వారికి సంబంధించిన స్థలాలను మాత్రమే టార్గెట్ చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు.
పాక్ నేవల్, ఎయిర్‌బేస్‌లపై గురిపెట్టామని, ఉగ్రదాడులకు ప్రతిచర్యగానే భారత్ ప్రతిదాడి చేసిందని చెప్పారు. గుంపులుగుంపులుగా డ్రోన్లను పాక్ భారత్‌పైకి పంపిందని అన్నారు. పాక్‌పై దాడి చేయడం తప్ప భారత్‌కు మరో మార్గం లేదన్నారు. పాక్‌లోని సైనిక స్థావరాలను పూర్తిగా నిర్వీర్వం చేశామని వెల్లడించారు. నిన్న పాక్ DGMO తనతో మాట్లాడి కాల్పుల విరమణకు ప్రతిపాదించారన్నారు. కాల్పుల విరమణ అంగీకారం కుదిరాక కూడా నిన్న రాత్రి పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని తెలిపారు. దానిపై పాక్ DGMO వివరణ అడిగామని, మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించామని తెలిపారు. ఇవాళ కనుక పాక్ దాడులకు దిగితే.. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్మీకి ఫ్రీహ్యాండ్ ఇచ్చామని హెచ్చరించారు.