అమ్మకానికి ఆక్సిజన్.. ఇదేమి దౌర్భాగ్యం !

NAGARJUNA NAKKA
దేశంలో ఇప్పటికే మంచినీళ్లు కొనుక్కునే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. కానీ తొలిసారిగా స్వచ్ఛమైన గాలి కూడా కొనుక్కుంటున్న నగరంగా దేశ రాజధాని ఢిల్లీ రికార్డు సృష్టించింది. హస్తినలో గాలి నాణ్యత పడిపోతున్న తరుణంలో.. ఆక్సిజన్ వ్యాపారం జోరందుకుంది. 


ఢిల్లీలో నానాటికీ వాయుకాలుష్యం పెరిగిపోతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వటంలేదు. స్వచ్చమైన గాలి కోసం ప్రజలకు ఎదురుచూపులు తప్పటంలేదు. దీన్ని అదనుగా భావించిన ఢిల్లీసాకేత్‌ ప్రాంతంలోని ఆక్సిప్యూర్‌ అనే బార్‌... స్వచ్ఛమైన గాలిని అమ్మకానికి ఉంచింది. 


పదిహేను నిమిషాల ఆక్సిజన్‌ను 299 రూపాయలకు అమ్ముతున్నట్లు బార్‌ నిర్వాహకులు తెలిపారు. లెమన్‌గ్రాస్‌, ఆరెంజ్‌, దాల్చినచెక్క, పుదీనా, పెప్పర్‌మింట్‌, యూకలిప్టస్‌, లావెండర్‌, వెనీలా, చెర్రీ, బాదం, వింటర్‌గ్రీన్‌, గార్డెనియాస్‌ వంటి ఏడు రకాల పరిమళాలలో ఆక్సిజన్‌ను అందిస్తున్నారు. వినియోగదారులు ట్యూబ్ ద్వారా గాలి పీల్చుకోవచ్చని బార్ నిర్వాహకులు చెబుతున్నారు. 


ఒక వ్యక్తి రోజులో ఒకసారి మాత్రమే ఆక్సిజన్ పీల్చే అవకాశం ఉంటుంది. రోజుకు ఒకసారి స్వచ్ఛమైన గాలి పీలిస్తే.. శరీరం ఉత్తేజితమవుతుందంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉంటుందని, మంచి నిద్ర పడుతుందని చెబుతున్నారు. ఒత్తిడి దూరం కావడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుందని కూడా అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతున్న వేళలో.. ఆక్సిజన్ వ్యాపారం తెరపైకి రావడం పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: