కరోనా కాటు : ఆన్లైన్ వ్యాపారం ఆఫ్ అయినట్టేనా ?

కరోనా వైరస్ ప్రభావానికి అతలాకుతలమౌతున్న ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం పెను ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. అసలు ఈ కరోనా వైరస్ కాటుకి ప్రపంచమంతా అల్లాడుతోంది. వైరస్ సోకిన వారి బాధ ఒకలా ఉంటే... అంతకంటే ఎక్కువగా మిగతా వారి బాధ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ కాటుకి మందు లేకపోవడం, ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు సామాజిక దూరం పాటించడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతుండడంతో అన్ని వ్యాపారాలు మూలనపడ్డాయి. ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సాహసం చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్ చేస్తున్న కంపెనీల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. సదరు ఆన్లైన్ కంపెనీలు కూడా కరోనా వైరస్ ప్రభావం తర్వాత తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అన్న ఈ విషయంపై భయం ఆందోళన చెందుతున్నాయి.

 


వాస్తవంగా భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ కు పెద్ద ఆదరణ ఉండేది కాదు. అయితే గత ఐదేళ్ల నుంచి అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఉప్పు దగ్గర నుంచి ప్రతిదీ ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేసేందుకు ప్రజలు బాగా అలవాటు పడిపోయారు. ఇంట్లో నుంచి ఆర్డర్ ఇస్తే ఎటువంటి శ్రమ లేకుండ వినియోగదారుల ఇంటి ముందుకే అన్ని వచ్చి పడుతుండడంతో ఆన్లైన్ మార్కెట్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. దేశీయంగా ప్రారంభించిన స్టార్టప్ లు, స్నాప్ డీల్,ప్లిప్ కార్ట్ వంటివి పెద్ద సంచలనమే సృష్టించాయి. మార్కెట్ రేసుల్పో స్నాప్ డీల్ చతికిలపడినా, ఫ్లిప్కార్ట్ మాత్రం వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత ఫ్లిప్ కార్ట్ లక్షా 75 వేల కోట్లకు వాల్ మార్ట్ కు అమ్ముడైంది. ప్రస్తుతం అతి పెద్ద ఆన్లైన్ మార్కెట్ కంపెనీగా అమెజాన్ ఉంది. ఇది విదేశీ కంపెనీ. ఇంకా కొన్ని వందల ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ అప్ లు ఇండియాలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫ్యాషన్ గ్రోసరీస్, మొబైల్ యాక్సెసరీస్, మెడిసిన్స్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 

 

ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ షాపింగ్ సైట్ లకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వీటిలో పెట్టుబడులు బాగానే వచ్చి చేరాయి. కానీ ప్రస్తుతం కరోనా దెబ్బకు దాదాపు నెల రోజుల పాటు కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో ఆన్లైన్ షాపింగ్ జీవన్మరణ సమస్యగా మారింది. లాక్ డౌన్ తర్వాత కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించినా, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ, ఖర్చులు ఇలా అన్ని అదనపు భారంగానే మారుతుంది. ఇక అప్పుల మీద, ఇన్వెస్ట్మెంట్ ల మీద నడిచే ఈ స్టార్టప్ లకు కరోనా గట్టిగానే దెబ్బ కొట్టింది. మళ్లీ కరోనా ప్రభావం తరువాత యధావిధిగా కార్యకలాపాలు కొనసాగించినా, మళ్లీ ఆన్లైన్ వ్యాపారం పుంజుకోవాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. అయితే రెండు మూడేళ్లపాటు పెట్టుబడిదారులు అంతా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశం ఉండడంతో వీరికి పెట్టుబడులు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉండదు అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల లాభాలు చవిచూస్తున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివాటికి పెద్ద ఇబ్బంది లేకపోయినా, మిగతా ఆన్లైన్ కంపెనీలకు మాత్రం పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: