లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఇవే...!
దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8443 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్నటివరకు 503 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 420కు చేరింది. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నాయి.
దేశంలో కరోనా వల్ల లాక్ డౌన్ అమల్లో ఉండటంతో లాక్ డౌన్ తర్వాత పరిశ్రమలు మరో సమస్యను ఎదుర్కోబోతున్నాయని తెలుస్తోంది. కరోనా వల్ల వేలాది మంది కార్మికులు ఇబ్బందులు పడి సొంతూళ్లకు చేరుకున్నారు. పరిశ్రమలు ప్రారంభమైనా వారు తిరిగి పనుల్లో చేరేందుకు చాలా సమయం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో కార్మికులు ప్రభుత్వం అనుమతి ఇస్తే సొంతూళ్లకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
దేశంలో లాక్ డౌన్ ఎత్తివేసినా కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆల్ ఇండియా మ్యానుఫాక్చరర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లడంతో వారు మరలా తిరిగి రావడం అంత తేలిక కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల కొరత సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలపై ఎక్కువగా పడనుందని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నగరాలపై ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది.