కరోనా మహమ్మారి... శరవేగపు పరుగును వెనక్కి తెచ్చేస్తోందా...?

Reddy P Rajasekhar

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ముందువరసలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి దేశ అభివృద్ధికి బ్రేకులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రజలు డబ్బు సంపాదనే లక్ష్యంగా బ్రతుకు జీవనం సాగించారు. 40, 50 సంవత్సరాల క్రితం దేశంలో ఉమ్మడి సంబంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఉండేవి. మనుషులు కూడా క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించేవారు. 
 
ఆ తర్వాత కాలంలో ఉమ్మడి కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రులు డబ్బు సంపాదనలో పడి పిల్లలను డే కేర్ సెంటర్లలో, హాస్టళ్లలో ఉంచుతున్నారు. పెద్దలను చూసుకునేందుకు తీరిక లేక వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. డబ్బు, లగ్జరీతో మాత్రమే సుఖం, సంతోషం వస్తాయని భావించి మనుషులు నేటి కాలంలో జీవనం సాగిస్తున్నారు. 
 
మనుషుల అభిరుచులకు అనుగుణంగానే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో గత దశాబ్ద కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న కుటుంబాల్లో నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. నేడు లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజా రవాణ, వ్యాపారాలు, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. కరోనా కట్టడి అయినా సాఫ్ట్ వేర్, రియల్ ఎస్టేట్ రంగాల పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ అంచనా వేయలేని స్థితి నెలకొంది. 
 
కొన్ని కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దేశం ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోగలిగినా నిన్నటి జీవితం మరలా పొందగలమా...? అనే ప్రశ్నకు సమాధానం కాదని వినిపిస్తోంది. కరోనా ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకువస్తుందా...? ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోవడానికి కారణమవుతుందా...? చూడాల్సి ఉంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: