కేంద్రం బంపర్ ఆఫర్.... సులభంగా 50 వేల రూపాయల రుణం పొందే అవకాశం..?
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. దీంతో కేంద్రం ఉద్ధీపన చర్యల్లో భాగంగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం ప్యాకేజీలో భాగంగా ముద్ర శిశు రుణాల గురించి కూడా కీలక ప్రకటనలు చేసింది.
ఈ రుణాలపై కేంద్రం 2 శాతం వడ్డీ తగ్గింపు ప్రకటించింది. దీంతో చాలామంది ముద్ర శిశు రుణాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాన్ మంత్రి ముద్ర యోజనలో భాగంగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు ఈ లోన్ తీసుకోవచ్చు. పీఎం ముద్ర యోజన కింద శిశు ముద్ర లోన్, కిషోర్ లోన్, తరుణ్ లోన్ అనే ముడు రకాల రుణాలు ఉన్నాయి.
తక్కువ మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ముద్ర శిశు లోన్ ప్రయోజనకరంగా ఉంటుంది. 50 వేల రూపాయల రుణం పొంది ఏదైనా బిజినెస్ ను ప్రారంభించవచ్చు. 12 నెలల కాలవ్యవధితో మూడు కోట్ల మంది ఈ రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం ఈ లోన్ పై 2 శాతం సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం ఈ రుణాలు తీసుకునే వారి కోసం 1500 కోట్ల రూపాయల వడ్డీ భరిస్తోంది.
చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ తరహా లోన్ ను ప్రవేశపెట్టింది. ఈ లోన్ ను పొందడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బి), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ఎంఎఫ్ఐలు, ఎన్బిఎఫ్సిల ద్వారా సులభంగా రుణాలను పొందవచ్చు. ఈ రుణాన్ని పొందడానికి ఎటువంటి హామీ అవసరం లేదు. 2015 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన ఈ రుణాలు ప్రారంభమయ్యాయి. https://www.udyamimitra.in/ వెబ్ సైట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.