ఆ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్.... నగదు డిపాజిట్ చేస్తే....?
దేశంలో లాక్ డౌన్ ప్రభావం ప్రైవేట్ బ్యాంకులపై తీవ్రంగా పడింది. ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. డిపాజిట్ రేట్లలో 0.5 శాతం కోత విధించడంతో బ్యాంక్ ఖాతాదారులకు ఇకపై తక్కువ రాబడి రానుంది. గత నెలలో రెండుసార్లు సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఈ బ్యాంక్ తాజాగా మరోసారి వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం.
గతంలో లక్ష రూపాయలకు పైగా సేవింగ్స్ చేసిన వారికి 4.5 శాతం వడ్డీ రేటు ఉండేది. కానీ తాజాగా వడ్డీ రేట్లను తగ్గించడంతో నిన్నటినుంచి లక్ష రూపాయలకు పైగా బ్యాలన్స్ కలిగిన సేవింగ్స్ ఖాతాలకు 4 శాతం వడ్డీ రేటు లభించనుంది. లక్ష రూపాయలలోపు సేవింగ్స్ ఖాతాలకు ప్రస్తుతం 3.5 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది. కోటక్ మహీంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయాల వల్లే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది.
ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు కరోనా వైరస్ విజృంభణ వల్ల రుణ వృద్ధి లేకపోవడంతో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఆర్బీఐ తాజాగా రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కోటక్ మహీంద్రా బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరికొన్ని ప్రముఖ బ్యాంకులు ఈ వారం వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గతంలోనే సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లపై 2.75 శాతం వడ్డీ లభిస్తోంది. మరో ప్రైవేట్ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉండటం పట్ల ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.