నిన్నటి నష్టాలను కొనసాగిస్తూ నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. నేడు బెంచ్ మార్క్ సూచీలు అన్ని చతికిల పడ్డాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం, హెవీ మెటల్ సంబంధించిన షేర్లు అమ్మకం కొనసాగడంతో నేడు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెస్ ఒకానొక సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోగా కొద్ది మేరకు తేరుకొని చివరకు 335 పాయింట్ల నష్టంతో 37,736 కు చేరుకుంది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 101 పాయింట్ల నష్టంతో 11,102 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి వస్తే... డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, వేదాంత, మారుతి సుజుకి, విప్రో, సన్ ఫార్మా కంపెనీల షేర్లు అత్యధికంగా లాభాలు పొందిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్ దాదాపు 5 శాతం పైన లాభపడింది. ఇక మరోవైపు హెచ్ డిఎఫ్‌సి, ఐఓసీ, బీపీసీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందుగా ఉన్నాయి. ఇక వీటిలో బీపీసీల్ ఏకంగా 8 శాతం పైగా నష్టపోయింది. ఇక నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్ లు మిశ్రమంగా ముగిసాయి.
నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ షేర్లు మినహా మిగతా అన్ని ఇండెక్స్‌లు నష్టపోయాయి. ఇక మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ చూస్తే నాలుగు పైసలు తగ్గి 74.84 వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు చూస్తే.. బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు 1.6 శాతం నష్టపోయి 43. 37 డాలర్లకు చేరుకుంది. అలాగే డబ్ల్యూటీఏ ముడిచమురు ధర కూడా 1.9 శాతం పైగా నష్టపోయి 40.46 డాలర్లకు చేరుకుంది.