కుప్ప కూలనున్న జాక్ మా సామ్రాజ్యం.. ఒక్క మాటే దెబ్బేసిందా..?
అక్టోబరు 24న షాంఘైలో ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సదస్సులో చైనాకు చెందిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాక్ మా మాట్లాడుతూ, చైనాలోని రెగ్యులేటరీ సిస్టమ్ ఇన్నోవేషన్స్ ను అణచివేస్తోందని, వృద్ధికి ఊతమివ్వాలంటే తప్పనిసరిగా సంస్కరణలు జరగాలని అన్నారు.
చైనా బ్యాంకులు ‘‘పాన్ షాప్’’ మెంటాలిటీతో పని చేస్తున్నాయని విమర్శించారు. ఈ మాట అక్కడికొచ్చిన వారికి రుచించలేదు. అంతే జాక్ మాకు బుద్ధి చెప్పాలని అనుకున్నారు. అతడి సువిశాల ఆర్థిక సామ్రాజ్యాన్ని నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు.
తక్షణ చర్యగా యాంట్ ఐపీఓను నవంబరులో సస్పెండ్ చేశాయి. షాంఘై, హాంగ్ కాంగ్ మార్కెట్లలో ప్రవేశించడానికి రెండు రోజుల ముందు ఈ షాక్ ఇచ్చాయి. దీంతో 37 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి డీల్‌తో తన యాంట్ గ్రూప్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందని భావించిన జాక్ మా కలలు కల్లలయ్యాయి.
ఇదిలా ఉంటే స్టేట్ కౌన్సిల్ జనరల్ ఆఫీస్ కూడా జాక్ మా వ్యాఖ్యలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఈ నివేదికను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర ఉన్నత స్థాయి నేతలకు సమర్పించింది. జాక్ మా వ్యాఖ్యలను అత్యధికులు వ్యతిరేకిస్తున్నట్లు ఈ నివేదిక చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో జాక్ మా నేతృత్వంలోని అన్ని కంపెనీలపైనా క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని అత్యున్నత స్థాయిలో ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ నేపథ్యంలో జాక్ మా సామ్రాజ్యం ఇక కనుమారుమరుగు కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినందుకే జాక్ కు కానీ వినీ ఎరుగని నష్టం కలుగబోతోందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.