భారత్‌కు అప్పు పడ్డ అమెరికా.. ఎన్ని లక్షల కోట్లో తెలుస్తే షాక్ అవుతారు
అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ అమెరికాపై పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఈ ఉద్దీపన ప్యాకేజీపై చట్టసభల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే దిగువ సభ(ప్రతినిధుల సభ) సభ్యుడు అలెక్స్ మూనీ.. అగ్రరాజ్యం అప్పుల గురించి ప్రకటించారు.
2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. దీని ప్రకారం దేశంలోని ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్టు ఆయన వివరించారు. కాగా.. ఇప్పటికి ఆ అప్పులు లెక్క 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపారు. చైనా, జపాన్ దేశాలకు ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందన్నారు.
అంతేకాకుండా.. భారత్‌కు 216 బిలియన్ డాలర్లను రుణపడి ఉందని అలెక్స్ మూనీ వెల్లడించారు. 1.9ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని చురకలంటించారు. మరి దీనిపై జో బైడెన్ సర్కార్ ఎలా స్పందిస్తుంది..? ఉద్దీపన ప్యాకేజీపై ముందుకెళుతుందా..? లేక వెనక్కి తగ్గుతుందా..? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.