కొత్త వ్యాపారంలోకి టీటీడీ..!
తిరుమల గిరులపై ఎన్నో రకాల సుగంధ పుష్పాలు ప్రతిరోజు వికసిస్తూ ఉంటాయి. అటు నారాయణ వనం మొదలు... ఎన్నో చోట్ల టీటీడీ ప్రత్యేక నర్సరీలను మెయిటెయిన్ చేస్తోంది. నిత్యం... వేల రకాల పూలు ఈ వనాల్లో వికసిస్తూ ఉంటాయి. వాటిలో సగం వరకు స్వామి వారికి నిత్యం ఉపయోగిస్తారు. రకరకాల సేవలకు కూడా స్వామి వారికి పూలను వినియోగిస్తుంటారు. వాటిని ఆ తర్వాత తీసేస్తారు. ఇకపై వాటి నుంచి సరికొత్త వ్యాపారం చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అదే అగరబత్తీల వ్యాపారం.
ఇప్పటికే ఈ విషయంపై అన్ని చర్యలు పూర్తి చేసిన టీటీడీ... ఈ నెల 13వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తీలను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. సప్తగిరుల గుర్తుగా మొత్తం ఏడు రకాల అగరబత్తీలను తీసుకువస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ముందుగా వీటిని తిరుమలో భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత అన్ని కల్యాణ మండపాల్లో ప్రజల కోసం అందుబాటులో ఉంచుతామని టీటీడీ ప్రకటించింది. స్వామి వారి సుగంధం ఇకపై ప్రతి ఇంట్లో రానుంది. గోవిందా గోవింద.