కార్పొరేట్ల గుప్పెట్లోకీ కరెంట్ వెళ్లనుందా..?

frame కార్పొరేట్ల గుప్పెట్లోకీ కరెంట్ వెళ్లనుందా..?

MOHAN BABU
దేశమంతా పెరిగిన ధరల మధ్య భారంగా దసరా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో, ఆదుకోవాల్సిన ప్రభుత్వం మరింత అంధకారంలో ముంచెత్తబూనడం ఆందోళన కలిగిస్తున్నది. విద్యుత్ సంక్షోభంపై వెలువడుతున్న వార్తలు, ఏలినవారి ప్రకటనలు చూస్తుంటే దేశం చీకటి అంచుల్లోకి   జారి పోతుందా అన్న సందేహం తలెత్తుతుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమెమో బొగ్గు కొరత లేదు విద్యుత్ కోత రాదు అని చెప్తుంటే, అస్సాంలోని అదే బిజెపి ప్రభుత్వం తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది,తక్షణమే విద్యుత్తును ఆదా చేసుకునే చర్యలు చేపట్టండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రం చెప్పేదే నిజమైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అసోం తో పాటు ఆంధ్రప్రదేశ్, డిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్,తమిళనాడు,జార్ఖండ్,బీహార్ ప్రభుత్వాలు కూడా తీవ్రమైన విద్యుత్ కోతలకు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ఈ సంక్షోభ నివారణకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి లేఖలు కూడా రాశారు.

బొగ్గు కొరత కారణంగా థర్మల్ యూనిట్లు మూసివేసినట్టు,విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్టు పలు రాష్ట్రాలు ఫిర్యాదులు కూడా చేశారు. ఒకవైపు ఈ సమస్య అంతకంతకూ తీవ్రమౌతూ విద్యుత్ సంక్షోభానికి దార తీస్తుండగానే, మరోవైపు మరిన్ని బొగ్గుగనుల అమ్మకానికి కేంద్రం  తెర లేపింది. ఇప్పటికే గని కార్మికుల తీవ్ర నిరసనలను, ప్రజల ఆందోళనను ఖాతరు చేయకుండా 28 బొగ్గు బ్లాకులను అమ్మేసిన కేంద్రం.. ఇప్పుడు మరో 40 బ్లాకుల అమ్మకాన్ని చేపట్టింది. తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్,జార్ఖండ్, మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలో విస్తరించిన ఈ గనుల్లో 55 బిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ముంచుకొస్తున్న సంక్షోభ నివారణకు ప్రయత్నించడం మాని, ఈ సమయంలోనే ఇంతటి అపారమైన ప్రజా సంపద అమ్మకానికి పెట్టడం లోని ఆంతర్యమేమిటి. ఈ విధంగా దేశంలో ప్రతిదీ నష్టాల పేరు చెప్పి ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: