చుక్కలు చూపిస్తున్న కూరగాయల ధరలు!

N.Hari
హైదరాబాద్‌లో గత పది రోజులుగా కూరగాయల ధరలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే వాటి ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కూరగాయల ధరలకు రెక్కలొచ్చి కొండెక్కాయి. దసరాకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కూరగాయల రేట్లు అన్నిచోట్లా దాదాపు డబుల్​ అయ్యాయి. మొన్నటి వరకు కిలో టమాట ధర 10 నుంచి 20  రూపాయలు ఉండగా.. ఇప్పుడు అది రూ. 60 కి చేరింది. పచ్చిమిర్చి కూడా కిలో రూ. 40 దాటింది. వంకాయ, దొండకాయ, చిక్కుడు, బీర, బెండ రూ. 60కి పైగానే పలుకుతున్నాయి. కొన్నిచోట్ల చిక్కుడు 100 రూపాయల దాకా చెబుతున్నారు. బిన్సీస్​ కూడా వంద రూపాయలకు తక్కువ లేదు. సాంబారులో ఎక్కువగా వినియోగించే సొరకాయ మొన్నటిదాకా రూ. 10 ఉండేది. ఇప్పుడది రూ. 30 కి తక్కువ రావట్లేదు. వీటితోపాటు ఆకు కూరలు ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర వంటి ఆకుకూరలు రూ. 40 పెడితే తప్ప నాలుగు కట్టలు రావట్లేదు.  ప్రతి కూర, పచ్చడిలో వినియోగించే కొత్తిమీర, పుదీనా, మెంతి ధరలు మండుతున్నాయి. ఒక్కో పెద్ద కట్ట రూ. 60 కి పైగా ధర పలుకుతోంది.
పండుగల సీజన్‍లో వెజిటబుల్స్ రేట్లు కొంత పెరగడం సహజమే. కానీ ఈసారి దాదాపు రెట్టింపు అయ్యాయి. ఈసారి వానాకాలం సీజన్​లో వరుస తుపానులు, భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల సమయంలో కురిసిన అకాల వర్షాలు నిండా ముంచాయి. దీంతో పంట దిగుబడి తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. మరికొన్ని  రోజుల పాటు ఈ తిప్పలు తప్పవని మార్కెట్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్​లోని మెహిదీపట్నం, కూకట్‌‌‌‌పల్లి, ఎర్రగడ్డ, ఎల్లమ్మబండ, అల్వాల్‌‌‌‌, ఆర్‌‌‌‌కే పురం, కొత్తపేట, ఫలక్‌‌‌‌నుమా, మేడిపల్లి, వనస్థలిపురం, మీర్‌‌‌‌పేట ప్రాంతాల్లోని రైతు బజార్లకు రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌, చేవెళ్ల, వికారాబాద్‌‌‌‌, శంకర్‌‌‌‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌ తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఆయా చోట్ల డైలీ 600 నుంచి 800 టన్నుల కూరగాయలు విక్రయాలు జరుగుతాయి. కానీ ప్రస్తుతం కేవలం 500 టన్నుల వెజిటబుల్స్ మాత్రమే వస్తున్నాయి. ఆకుకూరలు అయితే డిమాండ్​లో 50 శాతం కూడా రావట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. రేట్లు ఎక్కువగా ఉండడంతో వ్యాపారాలు సాగడం లేదంటున్నారు. మొత్తానికి పెరిగిన రేట్లతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: