వరంగల్ పత్తి రైతుల కష్టాలు వెంటాడుతున్నాయి. గిట్టుబాటు ధర ఉన్నా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. ఈసారి దిగుబడి తక్కువగా రావడంతో పెట్టుబడి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా సాగయ్యే పంట పత్తి. ఒకసారి కాకున్నా ఇంకోసారయినా తమ కష్టాలు తీరుస్తుందని తెల్ల బంగారాన్నే రైతులు నమ్ముకుంటున్నారు. గత ఏడాది పత్తి కి మంచి ధర రావడంతో ఈసారి పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. హన్మకొండ జిల్లాలో 62500 ఎకరాలు, వరంగల్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలు, జనగామ జిల్లాలో లక్షా ఎనభై వేల ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లక్ష ఎకరాలు, ములుగు జిల్లాలో 50 వేల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి.
ప్రస్తుతం పత్తి దిగుబడులు వస్తుండడంతో అమ్మెందుకు మార్కెట్ కు తీసుకువస్తున్నారు రైతులు. వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో పత్తి అమ్మకం మొదలైంది. ఈ ఏడాది పత్తి కి మంచి ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి 7300 రూపాయలు వరకు ధర లభిస్తుంది. గత రెండు మూడేళ్ల తో పోలిస్తే పత్తికి గిట్టుబాటు ధర గానే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ పత్తి 6 వేల వరకు ఉండగా, ఈ సీజన్ ప్రారంభంలోనే మంచి ధర పలుకుతోంది. కానీ రైతులకు ఆనందం మిగలడం లేదు. ఆగకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గిపోయిందని ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. తగ్గిన దిగుబడి ప్రస్తుతం లభిస్తున్న ధరతో కొంతమేర ఇబ్బందులు తీరవచ్చంటున్నారు రైతులు. ఇదే ధర కంటిన్యూ అయితే ఆ పరిస్థితి ఉంటుందంటున్నారు. కూలీల ధర పెరిగిపోయిందని, పెట్టుబడులు ఎక్కువయ్యాయని వారు చెబుతున్నారు. గత ఏడాదిలా దిగుబడి ఎక్కువగా వచ్చినట్లయితే తమ కష్టాలు తీరేది అంటున్నారు రైతులు.మార్కెట్లో ప్రస్తుతం ఉన్న పత్తి రేటుకు రెండు మూడు వందల తేడాతో సీజన్ అంతా కంటిన్యూ అవుతుందని చెబుతున్నారు వ్యాపారులు.
ఇతర రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతిందని తెలంగాణలోనే పత్తి దిగుబడి నాణ్యతగా ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాది 45 లక్షల బేళ్ళ పత్తి వచ్చిందని ఈ సారి అంత కంటే ఎక్కువ రావచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం తమ బకాయిలు ఏళ్ల తరబడి చెల్లించకుండాఇబ్బంది పెడుతోందన్నారు. విషయం మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని దీపావళి వరకు చెల్లించకపోతే అమ్మకాలు బంద్ చేస్తామని హెచ్చరించారు.