‘మనీ మ్యూల్‌’ స్కామ్ అంటే ఏంటి..?

frame ‘మనీ మ్యూల్‌’ స్కామ్ అంటే ఏంటి..?

Suma Kallamadi

 ఇటీవల కాలంలో కొత్త రకం సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు చివరికి సామాన్య ప్రజలను ఉపయోగించుకుని వారు డబ్బులు దొంగలిస్తున్నారు. ఈ కొత్త రకమైన మోసాన్ని "మనీ మ్యూల్" అంటారు. మోసగాళ్లు తమ దొంగచాటు డబ్బును సామాన్య ప్రజల ద్వారా తరలించుకుంటారు. ఇది ఎలా జరుగుతుందంటే, సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ జాబ్ ఆఫర్లు, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా నిజాయితీగా ఉండే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. వీరు ఇంట్లో కూర్చుని తక్కువ పనితో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని చెప్పి మోసగిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ ఆఫర్‌ను నమ్మితే, ఆ తర్వాత తమ అక్రమ కార్యకలాపాలకు వారిని ఉపయోగించుకుంటారు.
"మనీ మ్యూల్" స్కామ్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసగాళ్లు మన బ్యాంకు ఖాతాను ఉపయోగించుకుంటారు. వారు మన ఖాతాలోకి అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బును జమ చేయిస్తారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో వాళ్లకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ వారు అది చాలా ముఖ్యమైన పని అని చెప్పి మనల్ని ఒప్పిస్తారు. ఆ తర్వాత ఆ డబ్బును మరొక ఖాతాకు పంపించాలి. మనకు కొంత కమిషన్ కూడా ఇస్తారు. అంటే మనం తెలియకుండానే నేరగాళ్లకు సహాయం చేస్తున్నట్లవుతుంది. ఈ విధంగా మన బ్యాంకు ఖాతాను వాడుకుని వారు తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తారు.
ఈ మోసాల వెనక ఉన్న నిజమైన నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టం. చాలా సార్లు, ఈ మోసానికి బాధితులైన వారే నిందితులుగా మారే ప్రమాదం ఉంది. తెలియకుండానే ఈ మోసంలో పాల్గొనడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. జైలు శిక్ష, జరిమానాలు పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయబడటం వల్ల ఆర్థిక నష్టాలు కూడా వాటిల్లుతాయి.
పోలీసులు ప్రజలను మనీ మ్యూల్ మోసాల గురించి అప్రమత్తం చేస్తున్నారు. తక్కువ కష్టానికి ఎక్కువ డబ్బు వస్తుందనే ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులకు డబ్బు పంపించడం చట్టవిరుద్ధం అని గుర్తుంచుకోవాలి. మీ బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పకూడదు. మీ ఖాతాలో అనుమానాస్పదమైన లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు, బ్యాంకుకు తెలియజేయాలి.
తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థ ఎండీ వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా మనీ మ్యూల్ మోసాల గురించి ప్రజలను హెచ్చరించారు. మనీ మ్యూల్‌గా పని చేయడం చట్టవిరుద్ధమని స్పష్టంగా చెప్పారు. బ్యాంకు ఖాతాను ఇతరులు డబ్బు తరలించడానికి అనుమతించకూడదు. ఇలా చేస్తే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాలను మీ బ్యాంకుకు, రాష్ట్ర సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు లేదా సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ (1930) కి తెలియజేయాలని సజ్జనార్ గారు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: