వంటా వార్పు: ఇంట్లోనే సులువుగా నోరూరించే `చికెన్ దమ్ బిర్యానీ`
కావాల్సిన పదార్థాలు:
బియ్యం- అర కిలో
చికెన్- అర కిలో
కారం- రెండు టీ స్పూన్లు
ఉల్లిపాయలు- మూడు
గరం మసాల- ఒకటిన్నర టీస్పూన్
పెరుగు- ఒక కప్పు
నెయ్యి- ఐదు టేబుల్ స్పూన్లు
నిమ్మకాయ రసం- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి- ఆరు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- అర టీస్పూన్
జాజికాయ- ఒకటి
జాపత్రి- కొద్దిగా
నూనె- ఆరు టేబుల్ స్పూన్లు
పుదీన తరుగు- ఒక కప్పు
కొత్తిమీర తరుగు- ఒక కప్పు
తయారీ విధానం: ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలను కూడా శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, కారం, గరం మసాల, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. అలాగే మరోవైపు పచ్చి మిర్చి, పుదీన, కొత్తిమీర, జాజికాయ, జాపత్రి మిక్సీలో వేసుకుని నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా చికెన్‌లో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
మరియు ఉల్లిపాయలను సన్నగా, పొడవుగా తరిగి వాటిని నూనెలో వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకుని ఎసరుకు సరిపడా నీరు పోయాలి. ఆ నీరు మరిగిన తర్వాత మసాలా దినుసులు, ఉప్పు వేసి నీళ్లు మరిగాక బియ్యం వేసి, పది నిమిషాలు మాత్రమే ఉడికించి నీరు వడగట్టాలి. ఈ సగం ఉడికిన రైస్‌ను చికెన్ ఉన్న పాత్రలో ఒక పొరలాగ వేసి.. దీనిపైన వేయించి ఉంచిన ఉల్లిపాయలు మరో పొరలాగ వేయాలి.
ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా రైస్, ఆపైన ఉల్లిపాయలు వేసుకుని.. చివరిగా పైన కొద్దిగా నెయ్యి, నూనె, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి.. అంచులను గోధుమ పిండి ముద్దతో కవల్ చేసుకుని స్టవ్‌పై పెట్టుకోవాలి. ఒక అర గంట ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్క్ చేసుకుంటే సరిపోతుంది. అంతే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయినట్లే.