సినిమా ఫక్కీలో దాడులు.. రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లే వాహనాలే టార్గెట్..
రాత్రి పూట ఓ వ్యక్తి ఒంటరిగా తన కారులో వెళుతున్నారు. అయితే రోడ్డు మొత్తం నిర్మాణుష్యంగా ఉంది. సరిగ్గా జాజ్పూర్ ప్రాంతంలోకి రాగానే నలుగురు దొంగలు అతడి కారుపై దాడి చేశారు. వారిని చూడగానే కారును ఆపేశాడా వ్యక్తి. అయితే వారు తనను దోచుకునేందుకే వచ్చారని అతడికి అర్థమైంది. వారిని చూడగానే మొదట షాక్ అయినా.. తేరుకుని ఓ ప్లాన్ వేశాడు. దొంగలు దగ్గరకు రాగానే రివర్స్ గేర్ వేసి వేగంగా పోనిచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఆ నలుగురు దొంగలు కారును వెంబడించారు. కారుపై రాడ్లు, రాళ్లు విసిరారు. అయితే దారి నిర్మాణుష్యంగా ఉండడంతో కారు వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. ఇక దొంగలు కూడా ఏమీ చేయలేక కారును వదిలేశారు.
ఈ తంతంతా కారుకున్న డ్యాష్ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను అతడు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో డ్యాష్ కెమెరాతో తీయడంతో దుండగుల ముఖాలు క్లియర్గా కనిపించలేదు. అయితే ఈ వీడియోను ఆన్లైన్లో చూసిన ప్రతిఒక్కరికి వెన్నులో వణుకు పుడుతోంది. అతడు తన తెలివి చూపించకపోయి ఉంటే కచ్చితంగా దోపిడీకి గురయ్యేవాడని, దాన్ని మించి కూడా ఏమైనా జరిగి ఉండేదని నెటిజన్లు అంటున్నారు.
ఒక్క ఒడిశాలోనే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి దోపిడీలు జరుగుతున్నాయి. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, అనేకమంది దుండగులను అదుపులోకి తీసుకుంటున్నా.. ఫలితం అంతంతమాత్రంగానే ఉందనేది ప్రజల ఆరోపణ. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు రాత్రిళ్లు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని, ఇలాంటి దుండగులపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఒడిశాలో దారి దోపిడీలకు పాల్పడే వారిపై పోలీసులు గట్టి నిఘానే పెడుతున్నారు. ఈ ఏడాదిలో కూడా ఒడిశాలో రాత్రిళ్లు దోపిడీలకు పాల్పడుతున్న కొన్ని ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి బంగారం, మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.