ఉపాధి పనులకు వెళ్లి.. శవమై తేలిన మహిళ..?

N.ANJI
మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరిపెడ మండలం, ధర్మారం శివారు, సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా కాలేజీలు బంద్ కావడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. వారిది నిరుపేద కుటుంబం అయిన వారి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు ఉపాధి హామీ పనికి వెళ్తోంది. ఇక రోజూ మాదిరిగా ఆమె పనికి వెళ్లింది.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన రాజేష్ యువ‌తికి దారి మద్యలో కలిసి బండిపై తీసుకొని పక్కనే ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత గంట సేపటికి గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల్లో తీవ్ర రక్తస్రావంతో అచేతంగా ఆమె పడిపోయి ఉందంటూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామస్తులు ఆమె తండ్రికి సమాచారం అందించారు. అంతా గుట్టపైకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రాజేష్ యువ‌తిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.  పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్ట‌మ్ కోసం మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ త‌ర‌లించారు. యువ‌తి త‌ల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు.
ఇక మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజ‌న యువ‌తి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఉష మృతికి సంతాపం తెలిపిన‌ మంత్రి సత్యవతి రాథోడ్.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి దారుణాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: