దండుపాళ్యం సినిమాలో దొంగలు ఎంత కిరాతకంగా వ్యవహరిస్తారో తెలిసిందే. మనుషుల్లా కాకుండా మృగాళ్లలా ప్రవర్తిస్తుంటారు. దొంగతనాలు చేస్తూ హ్యత్యలు చేస్తూ ఉంటారు. ఇళ్లను టార్గెట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పనికానిస్తంటారు. ఇప్పుడు అచ్చం దండు పాళ్యం లాంటి బ్యాచ్ ఒకటి బెజవాడలో పట్టుబడింది. రెండు తలుపులు ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుని ఈ గ్యాంగ్ దొంగతనాలు చేస్తుంది. అంతే కాకుండా బాధితులకు తెలియకుండానే హత్యలు చేస్తోంది. అయితే చివరికి తీగ లాగగా డొంకంతా కదిలింది.
సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారంగా....సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లు గా పని చేస్తారని... ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని తెలిపారు. ఈ బ్యాచ్ అంతా పోరంకి, పెనమలూరులో ఉంటారని సీపీ వెల్లడించారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ లు వేసేవారని తెలిపారు. ఈ గ్యాంగ్ మొదటి నేరాన్ని పెనమలూరులో చేసిందని అన్నారు. అయితే కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా త్వరగా అంత్య క్రియలు కూడా చేసారని చెప్పారు. కంచికచెర్ల లో ఇద్దరు వృద్ధ దంపతులను కూడా గ్యాంగ్ అలాగే హత్య చేసిందని అన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో మొత్తం ఆరుగురిని హత్య చేసారని అన్నారు.
12వ తారీఖున ఈ గ్యాంగ్ పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే ప్రయత్నం చేసిందని సీపీ వెల్లడించారు. అక్కడ సీసీ కెమెరా లో నమోదైన విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారని తెలిపారు. కంచికచర్ల కేసులో సేకరించిన వేలిముద్రలు, పెనమలూరు ఏటీఎం చోరీకి యత్నించిన వ్యక్తుల వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయని అన్నారు. అంతే కాకుండా ఈ గ్యాంగ్ ఇప్పటి వరకూ చేసిన నేరాలలో హత్య జరిగినట్టు కూడా బాధితులకే తెలీకపోవడం గమనార్హమని చెప్పారు. అంతే కాకుండా ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే వీళ్లు టార్గెట్ చేస్తారని ఎస్పీ వెల్లడించారు.