ప్రమాదవశాత్తు కాలుజారి ఒక వృద్ధుడు వ్యవసాయ బాయి లో పడ్డాడు. ఎవరు ఆ వైపు రాకపోవడంతో మూడు రోజులు అందులోనే నరకయాతన అనుభవించాడు. చివరికి ఒక వ్యక్తి చూసి పోలీసులకు చెప్పడంతో పోలీసులు వచ్చి రక్షించారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లాలోని చిన్న గుండవెల్లి గ్రామం శివారులో ఉన్న పాడుబడిపోయిన వ్యవసాయ బావిలో గత మూడు రోజుల క్రితం సిద్దిపేటలోని బారా ఇమామ్ కాలనీకి చెందిన పైసా నారాయణ వయసు 80 సంవత్సరాలు, వృత్తి కూలి చేసుకుంటూ బ్రతుకుతాడు.
అతను దారి తప్పి కాలుజారి బావిలో పడి పోయాడు. దీంతో మూడు రోజులు ఆ బావి వైపు ఎవరు పోకపోవడంతో అందులోనే ఉండిపోయాడు. మూడు రోజుల తర్వాత పక్కన వ్యవసాయ పొలం అతను బావిలో నుండి అరుపులు వినపడగా వెళ్లి చూడగా బావిలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడని గమనించి వెంటనే సిద్దిపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించగా రూరల్ ఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ నర్సింలు , హోంగార్డ్స్ సయ్యద్, మల్లేశం, ఫైర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో వ్యవసాయ బావిలోకి దిగి దాదాపు మూడు గంటలు కష్టపడి, సిబ్బంది అంతా కలిసి తాళ్ళు కట్టి అతనిని సురక్షితంగా బయటకు తీసి రక్షించారు. వెంటనే 108 అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది ఈ విషయాన్ని వారి బంధువులకు తెలపగా వారు ఆస్పత్రికి వచ్చి మూడు రోజుల నుండి ఎక్కడికి వెళ్ళాడో కనబడటం లేదని వెతుకుతున్నామని తెలిపారు.
బావిలో పడిన తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసి రక్షించినందుకు సిద్దిపేట రూరల్ పోలీసులకు ఫైర్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడు రోజులు ఆ వ్యక్తి ఎంత నరకయాతన అనుభవించి ఉంటాడో అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు.