అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చినా కేటుగాళ్ల చేతిలో అమ్మాయిలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ యువకుడు ఏకంగా 200 మంది అమ్మాయిలను వందమంది మహిళలను మోసం చేశాడు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అమ్మాయిలకు మహిళలకు వల వేయడం తన వృత్తిగా చేస్తున్నాడు. అలా పరిచయం ఏర్పడిన అమ్మాయిల వద్ద నుండి డబ్బులు గుంజడం.. ఫోటోలు వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తూ వచ్చాడు. గతంలో చెడు వ్యసనాలకు బానిసై చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తాజాగా కేటుగాడి బండారం పోలీసులు బయట పెట్టారు. వివరాల్లోకి వెళితే.... కడప జిల్లా పొద్దుటూరు కు చెందిన ప్రసన్న కుమార్ అనే యువకుడు చిల్లరగా తిరుగుతూ ఉందేవాడు. హైదరాబాద్, విజయవాడ, కడపలో జులాయిగా తిరుగుతూ పలువురు అమ్మాయిలకు ఎర వేయడం ప్రారంభించాడు.
అంతేకాకుండా పేర్లను మార్చుకుంటూ సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరచి అమ్మాయిలకు రిక్వెస్ట్ పెట్టడం ప్రారంభించారు. అమ్మాయిలు రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారంటే మెల్లిగా మాటలు కలపడం... ఆ తర్వాత వారిని కలవడం లాంటివి చేసేవాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం... వీడియోలు బయటపెడతానని బెదిరించడం చేసేవాడు. అలా ప్రసన్నకుమార్ ఇప్పటివరకు రెండు వందల మంది అమ్మాయిలు, 100 మంది మహిళలను మోసం చేసినట్టు కడప డీఎస్పీ సునీల్ వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసై గతంలో ప్రసన్నకుమార్ చైన్ స్నాచింగ్ లకు కూడా పాల్పడి జైలుకు వెళ్ళినట్టు డీఎస్పీ తెలిపారు. అయితే పరువుకు సంబంధించిన విషయం కావడంతో మహిళలు, అమ్మాయిలు తాము మోసపోయామని ఎక్కడా ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
కాగా తాజాగా కడపలో ఉద్యోగం ఇప్పిస్తానని అమ్మాయిని మోసగించడం తో కేటుగాడి బండారం బయటపడినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రసన్న కుమార్ వద్ద 30 గ్రాముల బంగారం మరియు 1.26లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.