తవ్వేకొద్దీ కార్వీ మోసాలు!
కార్వీ ఎండీని సీసీఎస్ పోలీసులు రెండు రోజులు పాటు విచారించారు. మరింత లోతైన దర్యాప్తు కోసం కోర్టు అనుమతితో మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.షేర్లను బదిలీ చేసుకొని రూ.780 కోట్లు వరకు ఖాతాదారులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కస్టమర్ల షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఇండస్ బ్యాంక్‌లకు కార్వీ సంస్థ 1200 కోట్లు ఎగవేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తెలంగాణలోని బ్యాంకుల దగ్గరే రూ.3,000 కోట్ల స్కాం చేసినట్లు ఇప్పటి వరకు విచారణలో తేలింది . ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులు కలిపితే లెక్క పెద్దదే అని పోలీసులు చెబుతున్నారు.
కార్వీ ఆస్తులను మొత్తాన్ని బ్యాంకుల్లో కుదువ పెట్టి రుణాలు తీసుకున్నట్లు తేలింది. ఇప్పటికే బ్యాంక్ లాకర్లను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. కార్వీ సంస్థ రుణం పొందిన ఆరు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన బ్యాంకు అకౌంట్‌లలో రూ.13 కోట్లు క్యాష్ ఉన్నట్టు గుర్తించారు. కార్వీ ఎండీ పార్థసారథి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. తన ఆస్తులను అమ్మి ఖాతాదారులకు న్యాయం చేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.
కార్వీ ఎండీ పార్థసారథిని పీటీ వారెంట్‌పై తీసుకెళ్లేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు కసరత్తు చేస్తున్నారు . కొంతకాలం క్రితమే కార్వీ కన్సల్టెన్సీపై సెబీ ఆంక్షలు విధించింది. దీంతో గోల్‌మాల్ వ్యవహారం బయట పడింది.