ఓ దొంగ ఆవేదన.. డిప్యూటీ కలెక్టర్ ఇంటికి చోరీకి వెళ్లి.. ఏం చేశాడంటే..?
అయితే భోపాల్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగకు ఎలాంటి సామన్లు దొరకలేదు. దీంతో ఆ దొంగ చాలా ఫీలయ్యాడు. ఒక లేఖను రాసి ఆ ఇంటి యజమానికి తన గోడును చెప్పుకున్నాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా.. వాస్తవానికి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఘటన సంభవించింది. కొందరు దొంగలు డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ సింగ్ గౌడ్ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి చోరీ చేయాలనుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ కదా.. ఇంట్లో బాగా డబ్బు, విలువైన సామన్లు ఉంటాయని భావించి వెళ్లారు.
కానీ ఇంట్లోకి వెళ్లాక ఎంతో నిరుత్సాహం చెందారు. కేవలం రూ.30 వేలు విలువ చేసే వస్తువులు మాత్రమే లభించాయి. దీంతో దొంగ కోపంతో రగిలిపోయాడు. వెంటనే ఒక లేఖను రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లాడు. ఇంతకీ ఆ లెటర్‌లో ఏం రాశాడో తెలుసా.. ‘ఇంట్లో విలువైన సామన్లు, డబ్బు లేనప్పుడు.. ఇంటికి ఎందుకు తాళం వేశారు’ అని ఉంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ లేఖను చూసి షాక్ అయ్యాడు. ఈ మేరకు పోలీసుకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా త్వరలో దొంగను పట్టుకుంటామని చెప్పారు. కాగా, దొంగ లేఖ రాసిన విషయం పలువురికి తెలవడంతో అందరూ నవ్వుకున్నారు.