మళ్లీ వికటించిన మధ్యాహ్న భోజనం.. 70 మంది విద్యార్థులు అస్వస్థత
నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 321 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 264 మంది హాజరయ్యారు. రోజు మాదిరిగానే బుధవారం కూడా మధ్యాహ్న భోజనం పెట్టారు. అన్నం, పప్పుతో పాటు పిల్లలకు గుడ్డు వడ్డించారు. విద్యార్థులతో పాటు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా భోజనం చేశారు. అయితే, భోజనం చేసిన సేపటికే విద్యార్థులు కడుపు నొప్పితో అల్లాడి పోయారు. ఒక్కొక్కరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు విద్యా శాఖ అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. బీర్కూర్, బాన్సువాడ, వర్ని, కోటగిరి అంబులెన్స్‌లతో పాటు రెండు ప్రయివేటు వాహనాల్లో 70 మంది విద్యార్థులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముందస్తుగానే బాన్సువాడ ఆస్పత్రికి సమాచారం అందించడంతో విద్యార్థులకు సరిపడా పడకల వసతులు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్న భోజనంలో వడ్డించిన కోడిగుడ్డు మూలంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. గుడ్డు కుళ్లిపోయిన వాసన వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. తహసీల్దార్ రాజు, ఎంఈవో నాగేశ్వర్‌రావు వంటశాలను, సామగ్రిని పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తహసీల్దార్ చెప్పారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.
మరోవైపు అస్వస్థతకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పోచారం పరామర్శించారు. అనంతరం స్పీకర్ మాట్లాడారు. గుడ్డు తినడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు.