ఇటీవల మహేష్
బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి 12 కోట్ల రూపాయలకు పైగా డబ్బును హ్యాకర్లు మాయం చేశారు. ఇలాంటి సైబర్ దాడులు గతంలో కూడా చాలా బ్యాంకులపై జరిగాయి. రెండేళ్ళ కోవిడ్ టైం లో సైబర్ నేరగాళ్ల సంఖ్య చాలా పెరిగింది. వెబ్ సైట్లు,ఇతర ఈమెయిల్ అకౌంట్ లను హ్యాక్ చేయటం వేరు,బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేయడం వేరు. ఆన్లైన్
బ్యాంకింగ్,బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ల గురించి అవగాహన తో పాటు హ్యాకింగ్ నైపుణ్యాలు,
బ్యాంకింగ్ రంగంలో ఐటీ ప్రోగ్రామ్స్ పై నైపుణ్యం ఉన్నవాళ్లే ఈ పని చేయగలరు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసిన కస్టమర్ల డబ్బు, వ్యక్తిగత సమాచారం సేఫయినప్పటికీ కస్టమర్ల డబ్బు పోతే ఎవరు తిరిగిస్తారు.
బ్యాంకుల్ని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. చాలా సేఫ్టీ వాల్స్ ఉంటాయి. బ్యాంకు ఐటి స్టాఫ్ ఎప్పటికప్పుడు ఫైర్ వాల్ సేఫ్టీ, ఇంట్రూషన్ డిటెక్షన్, ప్రివెన్షన్ సిస్టమ్ ఇలా కొత్త కొత్త టూల్స్ తో అప్డేట్ అవుతూ ఉంటారు. అయితే హ్యాకర్లు కూడా నిత్యం వాటిలో లోపాలను కనిపెట్టే పనిలో ఉంటారని
హైదరాబాద్ సెక్యూరిటీ క్లస్టర్
డైరెక్టర్ జనరల్ జఖి ఖురేషి అంటున్నారు. బ్యాంకులకు సంబంధించిన డేటా అంతా సమకూర్చుకోవడానికి హ్యాకర్లు ప్రతిరోజు డిజిటల్ గా రెక్కీ నిర్వహిస్తారని ఇదంతా కనిపెట్టేందుకు వాళ్లకు ఆరేడు నెలలు,కొన్నిసార్లు ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చని, డేటా అంతా సేకరించాక అదనుచూసి దాడిచేసి డబ్బంతా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్ కి
మార్చి దేశాలు దాటిస్తారు. మహేష్
బ్యాంక్ హ్యాకింగ్ విషయంలో సర్వర్లు మాత్రమే హ్యాక్ అయ్యాయని, కస్టమర్ల ఖాతాలపై దాడి జరగలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
బ్యాంకుల వద్ద ఉండే మన వ్యక్తిగత వివరాలు దోపిడీకి గురైతే వాటిని ఉపయోగించి మరో రూపంలో మనపై సైబర్ దాడి చేయవచ్చని ఎథికల్ హ్యాకర్లు చెబుతున్నారు. కస్టమర్ల అకౌంటు నుంచి డబ్బులు బదిలీ అయితే వారికి మెసేజ్ లు వస్తాయి. వాటిని చూపించి 24 గంటల్లోగా బ్యాంకుకు లేదా ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలి. అప్పుడు మీ డబ్బు ఎట్టిపరిస్థితుల్లోనైనా బ్యాంకు వారు తిరిగి ఇవ్వాల్సిందే. హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి బ్యాంకులు చాలా సంసిద్ధంగా ఉండాలి. ప్రజలు కూడా సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్బీఐ సూచనలు, గొప్యత తప్పకుండా పాటించాలని ఎథికల్ హ్యాకర్లు చెబుతున్నారు.