ధరణి.. కేసీఆర్‌ ఓటమికి మరో కారణం అవుతుందా?

Chakravarthi Kalyan
భూమి తన చుట్టూ  తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా ప్రధానంగా భూమి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన అంశంగా ధరణి అయింది. ఇది అందరి రాజకీయ నాయకుల నోళ్లలో బాగా నానుతోంది . ఎంతో శ్రమించి.. మేధోమథనం చేసి మూడేళ్ల క్రితం ధరణి పోర్టల్ ని తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ చెబుతున్నారు. గతంలో భూ రికార్డుల్లో ఏదైనా చిన్న ఇబ్బంది తలెత్తితే వీఆర్ఏ స్థాయి నుంచి అంచెలంచెలుగా పైరవీ చేయాల్సిన పరిస్థితి.


రైతులు కూడా తన అవసరం మేరకు ఎంతో కంత ముట్టజెబుతూ వచ్చేవారు.  దీంతో రైతులకు రెవెన్యూ అంటే ఒకింత కోపం, అసహనం.  ఈ సమస్యలను అధిగమించేందుకే ధరణి తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ చెబుతూ ఉన్నారు. రైతులకు దీని వల్ల కలిగే ఉపయోగాలు చెప్పి ఓట్లు దండుకోవాలన్నిది బీఆర్ఎస్ వ్యూహం. అయితే ధరణితో ఇబ్బంది పడిన వారిని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ధరణి తీసేస్తారంటూ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం చేశారు.  ధరణి తీసేస్తారంటా.. బంగాళాఖాతంలో వేస్తారంటా.. మనం కాంగ్రెస్ వాళ్లను బంగాళాఖాతంలో వేయాలి అని పిలుపునిస్తూ వచ్చారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ ధరణి తీసివేస్తామని చెబుతూనే దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తామో చెబుతూ.. భూమాత ను తీసుకువస్తామని హామీ ఇచ్చింది.


ధరణిలో తమ భూమి కనిపించడం లేదని.. ప్రభుత్వ భూములు రికార్డుల్లోకి ఎక్కలేదని.. కొన్ని పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరాయని రైతులు వాపోతున్నారు. ధరణిలో ఇప్పుడు ఎదురవుతున్న సమస్యలన్నింటిని అధిగమించి.. రైతులందరికీ న్యాయం జరిగేలా తాము అధికారంలోకి వస్తే భూమాత ప్రవేశ పెడతామని హస్తం నేతలు చెబుతున్నారు.  భూ హక్కులు కాపాడి..కాంగ్రెస్ హయాంలో పంచిన 25లక్షల ఎకరాలకు కూడా పూర్తిస్థాయి హక్కులు వారికే కల్పిస్తామని కాంగ్రెస్ చెబుతోంది.  అయితే కేసీఆర్ కౌంటర్ కు ప్రతిగా కాంగ్రెస్ భూమాతను తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: