దేశానికే డేంజర్.. కాశ్మీర్ కథలో కొత్త మలుపు?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ అనుకూల శక్తులు జమ్మూలో ఉగ్రవాదం పెంచేందుకు తోడ్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ అన్న మాటలు.. కొన్ని పాత అనుభవాలు సమీక్షించుకోవడానికి, కొత్త వాస్తవాలు గ్రహించడానికి గుర్తుకు వస్తాయి.
పాకిస్థాన్ ఉగ్ర మూకలను కశ్మీర్ పౌర సమాజంలోకి చొప్పిస్తున్నదంటే అందుకు కారణం ప్రాంతీయ పార్టీలే అని జమ్మూ కశ్మీర్ డీజీపీ చెప్పుకొచ్చారు. జమ్మూ ఏన్ఎంలో విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ వాదన చిరకాలం నుంచి ఉన్నా.. పెద్దగా చర్చకు నోచుకోలేదు. ఇప్పుడు ఏకంగా పోలీస్ ఉన్నతాధికారి బహిరంగంగా దీని గురించి చెప్పడంతో కాస్తైనా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసం ఉగ్ర కార్యకలాపాలు, వాటి నాయకులు బలపడటానికి దోహదం చేస్తున్నాయని అని కూడా అన్నారు.
ప్రాంతీయ పార్టీలతో పాటు లోయలో ప్రధాన రాజకీయ పార్టీలుగా చెలామణి అవుతున్న వారు కూడా ఈ కార్యకలాపాలకు కారణం అని చెబుతున్నారు. ఒక పక్క ఉగ్రవాదులను సమర్థిస్తూ.. మరొక పక్క సాధారణ ప్రజలపై సానుభూతి చూపిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఆయా పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు. కశ్మీర్ లోయలో నెత్తురు పారిస్తున్నఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి రావడం సర్వసాధారణంగా మారిపోయింది.