అసలే పవర్‌ లేదు.. జగన్‌ అంత సాహసం చేస్తారా?

Chakravarthi Kalyan
ఏపీలో అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షాలు. మరోవైపు జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అన్నీ ఇండియా కూటమిలో భాగస్వాములు. ఈ విధంగా చూస్తే.. కాంగ్రెస్ కి టీడీపీ బద్ద రాజకీయ వ్యతిరేకిగా ఉండాల్సి ఉంది. అవే రాజకీయ లెక్కలు కూడా..

కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం కాంగ్రెస్ తో చంద్రబాబు కాంటాక్ట్ మెయింట్ నెన్స్ చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు రిలేషన్స్ కొనసాగిస్తున్నారని అని ఆరోపించారు. అంతే కాదు రాహుల్ గాంధీపై మీద సైతం పరోక్షంగా కామెంట్లు చేశారు. మణిపుర్ లో అల్లర్లు జరిగితే దాని మీద మాట్లాడే వారు ఏపీలో .. రాజకీయ దమనకాండ మీద ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

తమకు అనుకూలంగా ఉన్న వారి రాష్ట్రంలో ఏమి జరిగినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకి, కాంగ్రెస్ కి ఉన్న బంధం కూడా ఏమిటో తెలియాలని అన్నారు. అయితే ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ సీఎం జగన్ ధర్నా నిర్వహించారు. దీనికి మద్దతుగా ఇండియా కూటమిలోని ప్రధాన  పార్టీలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ మాత్రం రాలేదు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు రాలేదని జగన్ ని అడగ్గా వారినే అడగాలి అని సమాధానం ఇచ్చారు.

ఈ లెక్కన చూస్తే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్లరని స్పష్టంగా చెప్పినట్లయింది. అదే సమయంలో ఎన్డీయే కూటమికి సమదూరం పాటిస్తున్నారు. వాస్తవానికి జగన్ కి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి మద్దతు కావాలి. వారికే ఆయన సపోర్ట్ గా నిలబడతారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా కూటమి నేతలను, బీజేపీ వ్యతిరేక శక్తులను ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నారు.  పక్క రాష్ట్రంలో బీజేపీని ఎదిరించి కేసీఆర్ దెబ్బతిన్నారు.  ఎమ్మెల్సీ కవిత జైలులో ఉంది.  ఇవన్నీ తెలిసి జగన్.. ధైర్యంగా ఇండియా కూటమిలోకి వెళ్లే సాహసం చేయగలారా. అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: