చంద్రబాబు పాలన.. అప్పుడే జనం రోడ్లపైకి వస్తున్నారా?
కానీ ప్రజా ఉద్యమంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన చేపడతారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండో నెలలోనే తొలి ఉద్యమం జరిగింది. అక్రమ తొలిగింపులు-రాజకీయ వేధింపులను ఆపాలంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీలు, కలక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆశాలు, అంగన్ వాడీలు, వీవోఏలు, యూనిమేటర్లు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, గ్రీన్ అంబాసీడర్లు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.
కక్ష సాధింపు చర్యలు, తొలగింపులు, బెదిరింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. రాజకీయ వేధింపులకు తాము వ్యతిరేకం అని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లు పైకి చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదని విమర్శించారు.
ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగు వీవోఏలు, యానిమేటర్లు పెద్ద సంఖ్యలో తొలగింపునకు గురి అయ్యారని ఆరోపించారు. ఎన్నికల ముందు హామీలో ఇచ్చిన మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తుంటే.. దీనికి అనుబంధ రాజకీయ పార్టీ అయిన సీపీఎం వీరి పోరాటాలకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.