రేవంత్ రెడ్డిని చూసే కర్ణాటక ఆ నిర్ణయం తీసుకుందా?
బెంగళూరుకు దేశ, విదేశాల నుంచి గంట గంటకూ వేలాది మంది వస్తుంటారు. రాత్రి 11 కల్లా హోటళ్లు, బార్లు అన్నీ మూసేయాలి. దీంతో వారికి ఆహార, పానీయాలు లభించడం కష్టంగా మారుతోంది. దీంతో అర్ధరాత్రి వరకు హోటల్స్ తెరిచేందుకు ఒప్పుకోవాలని నగర ఎమ్మెల్యేలు శాసన సభలో డిమాండ్ చేశారు. ఇందుకు 2021లోనే ప్రభుత్వం కొన్ని షరతులతో ఆమోదించింది. అయితే సిబ్బంది కొరత, శాంతి భద్రతల సమస్యలు వస్తాయని అప్పటి నగర పోలీస్ కమిషనర్ ప్రభుత్వానికి సూచించడంతో కొంత మేర వెనక్కి తగ్గారు.
అయితే తాజాగా నైట్ లైఫ్ వేళలను ప్రభుత్వం పొడిగించడంతో వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ కోర్టు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లే బ్యాచ్ కు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరం కానుంది. అంతే కాకుండా.. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ నైట్ లైఫ్ కూడా బిజీబిజీగా గడిపే వారికి ఒంటి గంట వరకు హోటళ్లు తెరిచి ఉంచడం ఊరట కలిగించే అంశమే.
అయితే ఇటీవలే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగుల గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. ఇప్పుడు మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేయడం గమనార్హం. అయితే తాజా నిర్ణయం ఉద్యోగులకు వరంలా మారనుంది. దీనివల్ల ఉద్యోగం అయిపోయిన తర్వాత సరదాగా వారి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లి ఆ తర్వాత బయటే ఫుడ్ తిని ఇంటికి రావొచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్లు ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి.