బొత్సపై చంద్రబాబు.. అంత సాహసం చేస్తారా?
స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. దాదాపు 600కి పైగా స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి ఉన్నారు. ఇక కూటమికి 200 మంది మాత్రమే ఉన్నారు. అందుకే బలమైన అభ్యర్థి అవుతారని జగన్ బొత్సను ప్రతిపాదించారు. వారంతా ప్రలోభాలకు గురి కాకుండా బొత్స లూబీయింగ్ చేసి అడ్డుకట్ల వేయగలరని భావిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో అందరూ దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
మరోవైపు సీఎం చంద్రబాబు సైతం దీనిపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. ఒకవేళ పోటీలో ఉండి ఓటమి పాలైతే నెగిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు విశాఖ నేతలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఎంత మంది మనవైపు మొగ్గు చూపుతున్నారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
జగన్ ప్రభుత్వం తీరుపై స్థానిక ప్రజా ప్రతినిధుల్లో చాలా వ్యతిరేకత ఉందని.. మొదటి 11 నెలలు తప్ప వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ స్థానానికి అవసరం అయిన మద్దతు తాము కూడగడతామని వారు భరోసా వ్యక్తం చేయగా.. మరికొందరు దూరంగా ఉండటమే మంచిదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దీని గురించి లోతుగా అధ్యయనం చేసేందుకు చంద్రబాబు ఆరుగురితో కమిటీని నియమించారు. పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, జనసేన నుంచి పంచకర్ల రమేశ్ బాబు, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వీరి అభిప్రాయాలకు అనుగుణంగా పోటీపై అధినేత నిర్ణయం తీసుకోనున్నారు.