ఆ గజరాజలను అందుకే.. పవన్ ఏరికోరి తెచ్చారా..?

Chakravarthi Kalyan

ఆంధ్రప్రదేశ్ కర్టాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులను రాష్ట్రానికి పంపించేందుకు ఇరు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.  దీంతో త్వరలోనే ఆ రాష్ట్ర నుంచి కుంకీ ఏనుగులు మన రాష్ట్రంలోకి రానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. ఇంతకీ కుంకీ ఏనుగుల ప్రత్యేకత ఏంటి? ఇవేం చేస్తాయి.. ఎందుకు వీటిని తీసుకొచ్చేస్తున్నారు?


పంట పొలాలపై అడవి పందులు, నక్కలు, ఎలుగు బంట్లు వంటి వన్యప్రాణులు దాడి చేయడం గురించి మనకి తెలిసిందే. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి నిత్యకృత్యం. పంట పొలాలే కాదు.. కొన్ని సార్లు గ్రామాలపైన ఇవి దాడి  చేస్తుంటాయి. వాటిని గ్రామస్థులు తరిమి కొడుతుంటారు. కొన్ని సార్లు మనుషులపై దాడి చేయడంతో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.


ఇతర వన్య ప్రాణులు ఎలా ఉన్నా ఏనుగులు గుంపు అందుకు భిన్నం. మందలుగా విరుచుకుపడి పంటల్ని సర్వనాశనం చేస్తుంటాయి. మనుషుల్ని తొక్కి చంపేస్తుంటాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఈ కుంకీ ఏనుగులు గజగజలాడిస్తుంటాయి.


కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. ఎక్కడైనా ఏనుగులు గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగులను తరిమి కొట్టడంలో ఇవి కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని సార్లు గాయపడిన లేదా చిక్కుకున్న అడవి ఏనుగును రక్షించడానికి  వీటిని ఉపయోగిస్తారు. సాధారణంగా కుంకీ ఏనుగులుగా మనవాటినే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే ఇవి మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. వీటిని బంధించి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆపరేషన్ల కోసం వాడుతుంటారు. ఏనుగుల గుంపును అడవిలో తిరిగి పంపించేంత వరకు విశ్రమించవు. కొన్ని సార్లు పంట పొలాలపై వచ్చిన ఏనుగులతో ఇవి తలపడాల్సి ఉంటుంది. అందుకే పోరాడటంలోను వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: