ప్రధానిగా రాహుల్ గాంధీ.. ! దేశంలో కాంగ్రెస్ పుంజుకుంటుందా?
రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. కానీ భారత్ జోడో యాత్ర వరకు సీనియస్ నేతగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. అంటే.. ఇండియా కూటమి పార్టీల మొత్తానికి ఆయనే నాయకత్వం వహిస్తున్నారు అన్నమాట.
అయితే రాహుల్ గాంధీ లోక్ సభ పక్షనేతగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత మారిపోయింది. ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది. అనే పలు ప్రశ్నలను దిల్లీ వాసులకు జాతీయ మీడియా సంధించింది. వారి నుంచి సమాధానం రాబట్టింది.
రాహుల్ సీరియస్ లీడర్ గా స్థిరపడ్డారని కొందరు భావిస్తున్నారు. అయితే చాలా మంది పాత రాజకీయాలు తిరిగొచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయినా మార్పు కోసం అంచనాలు, ఆయన రాజకీయ సామర్థ్యంపై విశ్వాసం గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని.. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీలో చాలా మార్పులు వచ్చాయని దిల్లీ సీనియర్ సిటిజన్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాంధీ లోక్ సభలో క్రమం తప్పకుండా సమర్థవంతమైన ప్రసంగాలు ఇస్తున్నారు. దీని కారణంగా అధికార పార్టీలో అసంతృప్తి నెలకొంది అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై లేవనెత్తిన వివాదాలు కేవలం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర మాత్రమేనని అన్నారు. రాహుల్ ప్రజలతో మమేకం అవుతున్న తీరు చూస్తుంటే ప్రధాని పదవి చేపట్టే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తున్నాయని పలువురు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పనితీరు ఇప్పుడు బాగానే ఉందని.. భవిష్యత్తులో ఆయన ప్రధాని అవుతారు అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. అయితే దేశంలో కాంగ్రెస్ పుంజుకుంటోందని.. చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీకి, ఇండియా కూటమి పార్టీలకు సానుకూల పవనాలు వీస్తున్నాయని.. ఈ క్రమలో ప్రభుత్వాన్ని కూలదోసి ప్రధాని పదవి చేపట్టినా ఆశ్చర్యం లేదని మరో సీనియర్ సిటిజన్ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాహుల్ గాంధీ విషయంలో అటు పబ్లిక్ లోను, పార్టీలోను సానుకూలత వ్యక్తం అవుతోంది.