శిష్యుడికి వెన్నుపోటు పొడుస్తున్న బాబు..!
ఉమ్మడి ఏపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఏంటా అని చాలా మంది సందేహించారు. 2014లో ఏపీలో అధికారం చేపట్టి.. తెలంగాణలో ప్రభావవంతమైన పార్టీగా మిగిలిన టీడీపీ… 2018 లో ముందస్తు ఎన్నికల నాటికి ఇంకాస్త దూకుడుగా కనిపించింది. ఏ కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ పార్టీ పుట్టిందో అదే హస్తం పార్టీతో జట్టు కట్టి కమ్యూనిస్టులను కలుపుకొని తెలంగాణలో మహా కూటమిగా ఏర్పటి పోటీ చేసింది.
కొన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. కానీ వారు ఆ తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయానికి ఏపీలో టీడీపీ అధికారంలో ఉండటంతో వారికి పెద్దగా రాజకీయంగా ఇబ్బంది కలుగలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవ్వడంతో టీడీపీని వరుస కష్టాలు వెంటాడాయి. టీడీపీకి ఉమ్మడి ఏపీలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా 23 సీట్లే దక్కాయి. దీంతో పాటు వైఎస్ జగన్ దాడిని తట్టుకోవడం కష్టమైంది. స్థానిక ఎన్నికల్లో దారుణ పరాజయాలు ఆ పార్టీని కుంగదీశాయి.
ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ కు మేలు చేసేందుకు ఈనిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చినా.. అవేవీ నిలువలేదు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో వలసలు కాంగ్రెస్ లోకి ప్రారంభం అయ్యాయి. అలాగే 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.
దీంతో ఇప్పుడు పార్టీకి పునర్వైభవం కోసం చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం కోసం దృష్టి పెడతానని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే గతంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తాను కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో తెలంగాణలో సీఎం చంద్రబాబు పార్టీని పటిష్ఠపరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల చేరికతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందా లేదా అనేది చూడాలి.