కూటమి ప్రభుత్వం రివెంజ్ స్టార్ట్..! ఆ ఛానళ్లను నిషేధించారుగా..?
మీడియా రంగం కలుషితం అయిపోయింది. ఇప్పుడు మీడియా రాజకీయ పార్టీలకు అనుగుణంగా మారిపోయింది. మీడియాలో ప్యాకేజీల పర్వం నడుస్తోంది. ప్రింట్ మీడియా, ఎలక్ర్టానిక్ మీడియా కొత్త పుంతలు తొక్కింది. అంత వరకు ఓకే కానీ.. వాటి నిర్వహణ కూడా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో మీడియా ఏదో ఒక రాజకీయ పార్టీపై ఆధారపడక తప్పలేదు.
ఏపీలో సైతం మీడియా విభజన జరిగిపోయాయి. టీడీపీ కి అనుకూలంగా వ్యవహరించే వారు ఎల్లో మీడియాగాను, వైసీపీకి అనుకూలంగా వార్తలు రాసేవారు నీలి మీడియాగానూ అవసరరాలకు తగ్గట్లు నడుచుకునేవి తటస్థ మీడియాగానూ విభజనకు గురయ్యాయి. అయితే రాజకీయ పార్టీలు మాదిరిగా.. ప్రభుత్వానికి, పాలకుల ఆగ్రహానికి మీడియా బాధితులుగా మిగులుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే ఫలానా మీడియా.. టీడీపీ అధికారంలోకి వస్తే ఫలానా మీడియాను నిషేధిస్తారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ వంటి వాటిని నిషేధించారననే ప్రచారం అప్పట్లో సాగింది. అయితే అది అధికారికంగా నిషేధించకపోయినా కేబుల్ ఆపరేటర్ల ద్వారా వాటిని నియంత్రంచారనే ప్రయత్నం జరిగిందన్నది వాస్తవం. అప్పట్లో బాధిత మీడియాతో పాటు టీడీపీ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పడుఉ అదే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అనుకూల మీడియాపై నిషేధం విధిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సాక్షి, టీవీ 9, ఎన్టీవీపై అనధికార నిషేధం నడుస్తుందని.. కేబుల్ ఆపరేటర్ల ద్వారా నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ తాజాగా ఒక ట్వీట్ పెట్టింది. రాష్ట్రంలో మూడు మీడియా చానళ్లను నిషేధించారని అందులో ఆరోపించింది. తెలుగు నాట అత్యంత ప్రజాధారణ పొందిన టీవీ9, సాక్షి, ఎన్టీవీ న్యూస్ ఛానళ్లపై చంద్రబాబు కత్తి కట్టారు. రాష్ట్రంలో ఛానళ్లు ఎక్కడా ప్రసారం కాకూడదు అని ఆయా ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. అయితే గతంలో వైసీపీ చేసిన తప్పులకు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకుందని.. అవే తప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తే మూల్యం తప్పదని విశ్లేషకులు అంటున్నారు.