ఇరాన్ ఇజ్రాయెల్ కథ క్లైమాక్స్ కి చేరిందా? ఏ క్షణమైనా బాంబుల మోత తప్పదా?
''ఇరాన్ పొరపాటున ఇజ్రాయెల్‌పై మరో క్షిపణి ప్రయోగిస్తే ఆ దేశాన్ని ఎలా ఛేదించాలా మరోసారి చూపిస్తాం. ఈసారి ఎప్పుడూ ఉపయోగించని సామర్థ్యాలతో కూడా వాడతాం. మేము వదిలిపెట్టిన ప్రదేశాలు, సామర్థ్యాలు రెండింటిపైనా చాలా చాలా గట్టిగా దెబ్బ కొడతాం'' అని అన్నారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైనికులతో హెర్జి హలేవి అన్నారు. ఇరాన్‌లో కొన్ని లక్ష్యాలపై మళ్లీ దాడి చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా ముగియలేదని, మధ్యలోనే ఉన్నామని హెచ్చరించారు.
ఈ నెల ప్రారంభంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగా.. దానికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి ఉత్పత్తి కేంద్రాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పోయిన శనివారం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా గత నెల నుంచి లెబనాన్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక మంగళవారం మరో ముఖ్యమైన పరిణామం జరిగింది. గ్రూపు చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ బలగాలు అంతమొందించడంతో ఆయన స్థానంలో డిప్యూటీ హెడ్ నైమ్ ఖాస్సేమ్‌ను ఎంపిక చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది.
గత నెలలో దక్షిణ బీరుట్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో నస్రల్లా చనిపోయాడు. హిజ్బుల్లా కొత్త చీఫ్‌ను నియమించుకోవడంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ స్పందించారు. ఖాస్సేమ్ తాత్కాలిక నియామకమని, ఈ నియామకం ఎక్కువ కాలం కొనసాగదని హెచ్చరించారు. 'కౌంట్‌డౌన్ ప్రారంభమైంది' అంటూ ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.