మొదలైన ఏబీఎన్ ఆర్కే, విజయ సాయి రెడ్డి వార్? ఈ సారి విజయసాయి వంతు!
ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఎడిటోరియల్ పేజీలో రాసే తన వ్యాసంలో విజయసాయి రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. తనతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమాన్ని చేసే దమ్ముందా? అంటూ విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. తనను బహిరంగ వేదికల మీద నానా మాటలు అనేసే విజయసాయి.. నాలుగు గోడల మధ్య మాత్రం తనకు వివరణ ఇచ్చుకుంటున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఓపెన్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఆర్కేకు ప్రతి సవాలు విసిరారు.
''రాధాక్రిష్ణ.. బహిరంగ చర్చకు నేను రెఢీ. నీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా. ఫేస్ టు ఫేస్.. కౌంటర్ కు ఎన్ కౌంటర్ నేను సిద్ధం. నువ్వు సిద్దమా? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా? ఢిల్లీలో ఎన్జీవోలు.. మేధావులు.. జర్నలిస్టులు.. అన్ని టీవీ చానల్స్ ను అందరిని ఆహ్వానిద్దాం'' అంటూ కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఆర్కేపై పలు వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టు కాలనీలో నువ్వు ఉండే ప్యాలస్.. నేను ఉండే బాడుగ ఇళ్లు కూడా చూపిద్దాం. ఫిలింనగర్ మొయిన్ రోడ్డులో నువ్వు కొన్ని రూ.100 కోట్లు విలువ చేసే స్థలం.. దాన్లో ఇంకో రూ.200 కోట్లతో కడుతున్న ఆఫీస్ భవంతిని పరిశీలిద్దాం. రాధాక్రిష్ణ.. నీ పత్రిక.. టీవీని ఏ పునాదులపై నిర్మించుకున్నావో మరువద్దు. నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికాకు వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవటం వాస్తవం కాదా? కలర్ బ్లైండ్ నెస్ లా నీ కళ్లకు కొందరే కనిపిస్తారు. మిగితావాళ్లంతా నీవేం అన్నా పడాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను ఐక్య రాజ్య సమితి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్దమన్న విజయసాయి.. 'ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందామని.. తగ్గేదేలే.. భయపడేదేలే అని వ్యాఖ్యానించారు. మరి.. విజయసాయి తాజా ప్రతిసవాలుకు ఆంధ్రజ్యోతి ఆర్కే ఎలా రియాక్టు అవుతారో చూడాలి.