సచివాలయ ఉద్యోగులకు కొత్త నిబంధనలు పెడుతున్న చంద్రబాబు? ఇలా అయితే ఈ వ్యవస్థ కూడా కష్టమేనా?
గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అటెండెన్స్ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం, సాయంత్రం వేళల్లో హాజరు నమోదు చేయాలని సూచించింది. గతంలో రోజుకు ఒకసారి మాత్రమే హాజరు వేస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పింది.
అప్పట్లో వైసీపీ బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనిని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చూసుకుంటామన్నది ఆ హామీ. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత చూపారు. అయితే ఇప్పుడు హాజరు విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.
గత సెప్టెంబర్ లో హాజరు విషయంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం 10:30 గంటలకు మొదటిసారి, మధ్యాహ్నం మూడు గంటలకు రెండోసారి, సాయంత్రం ఐదు గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజాగా ఈ హాజరు విషయంలో మరో నిబంధనను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఉదయం సాయంత్రం వేళల్లో మొబైల్ యాప్ లో అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హాజరుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక యాప్ రూపొందించింది. విధులకు హాజరైనప్పుడు, వీధుల ముగింపు సమయంలో కచ్చితంగా ఆ యాప్ లో నమోదు చేయాలి. లేకుంటే విధులకు గైర్హాజరైనట్లే. అయితే ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నామని.. ఇప్పుడు మొబైల్ యాప్ లో కూడా హాజరు నమోదు చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీతం మూరెడు.. పని బారేడు అన్నట్టు ఉంది తమ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.