సజ్జల సమైక్య రాగంపై షర్మిల ఫైర్? అసలు కథ ఏంటి?
ఎంతో మంది బలిదానాలు, త్యాగాలపై తెలంగాణ ఏర్పడిందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలను కలపడం మీద కాకుండా అభివృద్దిపై ధ్యాసపెట్టాలని సజ్జలకు వైఎస్ షర్మిల హితవు పలికారు. హక్కుల కోసం పోరాటం సహా ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలని కానీ... తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తగదని వైఎస్ షర్మిల అన్నారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైసీపీ విధానమని...సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఖండించారు.
విడిపోయిన రెండురాష్ట్రాల కలయిక తిరిగి జరిగేది కాదని... భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నందునే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చినట్లు భట్టి విక్రమార్క వివరించారు. సమైక్య నినాదం కొత్తకాదని...గతంలోనూ వారు అదే మాట్లాడారని భట్టి విక్రమార్క తెలిపారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి పదేళ్లు కావస్తున్నా... రాజ్యాధికారం కోసం మళ్లీ తెలంగాణపై దాడి జరిగే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి కావాలని కోరుకోవాలి తప్ప మరోసారి తెలంగాణపై పెత్తనం చెలాయించాలనిచూస్తే సహించేదిలేదని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని ఓర్వలేకనే ప్రధాని మోదీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దన్నుతోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని పల్లా మండిపడ్డారు. ఇదంతా కేసీఆర్, జగన్ కలిసి ఆడుతున్న నాటకమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.