ఆ ఏడుపు గొట్టు రాతలే గాని... జగన్ చేసిన ఈ మంచిపని కనిపించలేదే..!
అవును. ఏపీ ప్రభుత్వంపై ఏడుపు కధనాలతో దూసుకు పోతున్న ఓ వర్గం మీడియాకు తాజాగా ప్రభుత్వం మంచి పనులు చేస్తోందంటూ.. ఏకంగా నీతి ఆయోగ్ వెల్లడించిన విషయాలు ఏ మాత్రమూ కనిపించకపోవడం గమనార్హం. కేంద్ర విభాగానికి చెందిన నీతి ఆయోగ్.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి వంటి అంశాలను తీసుకుని.. తాజాగా నివేదిక ఇచ్చింది. సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ అనేక రంగాల్లో ముందడుగు వేసిందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ఎంతో మెరుగైన రీతిలో పనితీరు కనబర్చింది.
ఉపాధి పనుల కల్పనలోగానీ, ధాన్యం ఉత్పత్తిలోగానీ, ప్రజారోగ్యంలోగానీ ఎంతో పురోగతి సాధించింది.. రక్షిత తాగునీటి సరఫరా.. శాంతిభద్రతల్లో అగ్రగామిగా నిలిచింది. 100 సూచీల ఆధారంగా నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ దీనిని సాధించింది. అందరికీ న్యాయం అందించడంతో పాటు అసమానతలను తొలగించడంలో మన రాష్ట్రం మంచి ఫలితాలు సాధించింది. మొత్తం మీద సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భారత్ ‘60 స్కోరు’ సాధించిగా, రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ‘67 స్కోర్’ సాధించింది.
ఇక, రంగాల వారీగా తీసుకున్నా.. రాష్ట్రంలో గృహాల విద్యుదీకరణ 2018–19లో 99 శాతం ఉండగా 2019–20లో నూరు శాతానికి చేరుకున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. వంద మంది జనాభాకు 2018–19లో ఇంటర్నెట్ వినియోగం 37.21 శాతం ఉండగా 2019–20లో అది 54.53 శాతానికి పెరిగింది. పీఎంఏవై (ప్రధానమంత్రి ఆవాస్ యోజన) కింద 2018–19లో ఇళ్ల నిర్మాణం 2.48 శాతమే ఉండగా 2019–20లో 24.89 శాతానికి చేరింది. వార్డుల్లో డోర్ టు డోర్ చెత్త సేకరణ 2018–19లో 95.83 శాతం ఉండగా 2019–20లో నూటికి నూరు శాతం సాధించింది.
వ్యర్థాల నిర్వహణ 2018–19లో కేవలం ఏడు శాతమే ఉండగా 2019–20లో 48 శాతానికి పెరిగినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలోనూ జగన్ సర్కారు దూకుడుగానే ముందుకు సాగుతోంది. అయితే, ఈ విషయాలు తెలిసి కూడా పచ్చ మీడియా తన పాతపాటనే పాడింది కానీ.. మాట మాత్రంగా అయినా.. మెచ్చుకోలుకు చిన్న సింగిల్ కాలమ్ ఇవ్వలేక పోయింది!!