హెరాల్డ్ ఎడిటోరియల్ : రాష్ట్రంలో ఈమె ఇపుడు హీరో అయిపోయింది.. ఎందుకో తెలుసా ?

Vijaya
అవును మణిపూర్ లోని మామూలు జనాల్లో చాలామంది ఇపుడు బృందా..బృందా అంటూ బృందగానమే చేస్తున్నారు. విధి నిర్వహణలో ఆమె చూపించిన పట్టుదల, ధైర్యం, నిబద్ధతకు యావత్ మణిపూర్ సలాం అనేసింది. ఇంతకీ ఈ బృంద ఎవరో తెలుసా ? అయితే ఈ కథనం చదవాల్సిందే. మణిపూర్ రాష్ట్రలోని పశ్చిమ ఇంఫాల్ లో అడిషినల్ ఎస్పీగా తౌనాజమ్ బృందా రెండేళ్ళుగా  పనిచేస్తోంది.  రెండేళ్ళ క్రిందట ఉద్యోగ ధర్మంలో భాగంగా అనేక చోట్ల తనిఖీలు చేస్తుంటుంది. ప్రధానంగా డ్రగ్స్ వాడకం, సరఫరా, అమ్మకాలపై బృందా ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే చందేల్ స్వయం ప్రతిపత్తి జిల్లాకు ఛైర్మన్ విషయంలో ఉప్పందిందట. వెంటనే ఛైర్మన్ అయిన ఖోసిజౌ ఇంటిపై దాడి చేసింది.

మామూలుగా రాజకీయ నేతల ఇళ్ళపై దాడులు చేయాలంటే అసలు అధికారులకు ఎంత గట్స్ ఉండాలి. అందులోను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి భార్యకు దగ్గర చుట్టమూ అయిన ఖోసి ఇంటిపై దాడి చేయటమంటే మామూలు విషయమా ? కానీ మన బృందా దేన్ని పట్టించుకోలేదు. తనకు వచ్చిన సమాచారం కరెక్టని నిర్ధారించుకున్న తర్వాతే అడిషినల్ ఎస్పీ తన బృందంతో కలిసి ఖోసి ఇంటిపై దాడి చేసింది. ఆ సోదాలో నాలుగున్నర కేజీల హిరాయిన్+కొంత డబ్బు దొరికిందట. ఇంకేముంది వెంటనే ఖోసిపై కేసు నమోదు చేసేసింది. ఆలస్యం చేస్తే ఎక్కడ ఒత్తిళ్ళు మొదలైపోతాయో అన్న ముందుచూపుతోనే ఎఫ్ఐఆర్ కూడా రిజస్టర్ చేసేసింది.

మామూలుగా అయితే ఇపుడు బృందా గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే దేశంలో అక్కడక్కడ ఈపాటి గట్టిగా ఉండే అధికారులు కనబడుతునే ఉంటారు. మొన్నటికిమొన్న గుజరాత్ లో సునీత అనే కానిస్టేబుల్ కూడా మంత్రి కొడుకును రోడ్డుపై నిలదీసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఇంఫాల్ లో బృందా చేసిన తర్వాత పనితోనే అందరు బృందగానం చేస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేమిటి ? ఒకవైపు డ్రగ్ డాన్ ఖోసి విషయం కోర్టులో విచారణ జరుగుతోంది. ఇంతలో బృంద కొత్తగా కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసిందట. డ్రగ్ డాన్ ఖోసిపై చార్జిషీటు వేసిన దగ్గర నుండి అంటే గత రెండేళ్ళుగా తనపై ఎవరెవరు, ఎలాగ ఒత్తిళ్ళు పెట్టారనే విషయాలను చాలా డీటైల్డ్ గా నోట్ చేసి తాజాగా ఓ అఫిడవిట్ కోర్టుకు దాఖలు చేసింది.

తన అఫిడవిట్ లో ఖోసికి మద్దతుగా స్వయంగా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటికి పిలిచి చివాట్లు పెట్టాడట. డ్రగ్ డాన్ ను వదలిపెట్టకుండా చార్జిషీటు వేసినందకు డిజిపి కూడా బృందాను పిలిచి బాగా తిట్టాడట. ఇదే సమయంలో తనపై అధికారులు, సహచరులు ఖోసిజౌను విడిచిపెట్టాలంటూ తనపై ఎలాంటి ఒత్తిళ్ళు తెచ్చింది పూసగుచ్చినట్లు వాళ్ళ పేర్లతో సహా తన అఫిడవిట్లో చెప్పేసింది. అంతే కాకుండా తాను ఎవరి మాటను వినకుండా చార్జిషీటును దాఖలు చేసినందుకు డిపార్ట్ మెంటులోనే కాకుండా బయట కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నదీ కూడా స్పష్టంగా వివరించిందట.

ఓ దశలో తనపై వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోదామని కూడా అనుకున్నది. అప్పట్లో ఆమె ఉద్యోగాన్ని వదిలేసుంటే ఇపుడు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళమే కాదు. కానీ ఒత్తిళ్ళు ఎక్కడైనా ఉంటాయంటూ తనకు తానే సమాధానం చెప్పుకుని తాను చేయాల్సిన పని చేయాల్సిందే అంటూ తీర్మానించుకున్నది. ఒత్తిళ్ళకు ఎదురుతిరిగి నిలిచినందుకు, ఒత్తిళ్ళ గురించి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినందుకే మామూలు జనాలు ఇపుడు బృందాకు జై కొడుతున్నారు. యువతకు, యువ అధికారులకు బృంద ఓ స్పూర్తిగా నిలిచిందనే చెప్పాలి. మనమూ హ్యాట్సాఫ్ చెబుదాం అడిషినల్ ఎస్పీ  బృందకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: