జగన్ మనసు పెట్టాడు.. మంచి జరగక మానుతుందా?!
``ఎవ్వనిచే జనియించు.. జగమెవ్వని లోపల ఉండు లీనమై..`` అంటారు పోతనగారు.. భాగవతంలో! ఇలాంటి తాత్వికతే.. రాజకీయ నేతలకు కూడా ఉండాలని చెబుతారు.. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం.. తన `వింగ్స్ ఆఫ్ ఫైర్` పుస్తకంలో. ఏదో చేశాం.. చేస్తున్నాం.. చేస్తాం.. అనే మొక్కుబడి మాటలకు నాయకులు పరిమితం కారాదనేది కలాం భావన.. సూచన.. నిర్దేశిత సలహా కూడా! ఎందుకంటే.. ప్రజల చేత-ప్రజల కొరకు-ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు మాటలుచెప్పి.. తప్పుకోవడాన్ని ఆయన తప్పుబడతారు. ప్రజలకు ఏదైనా చేయాలనే సత్సంకల్పం నాయకుల మనసుల్లోంచి రావాలని అంటారు. అలాంటి నేతలు కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని ఉద్ఘాటిస్తారు.
పోతనామాత్యుడు చెప్పిన విషయాన్నే తనదైన కోణంలో కలాం ఆవిష్కరిస్తారు. మొత్తంగా ప్రజలకు ఏదైనా చేయాలి.. ప్రజలే నేను అనుకోవాలి.. ప్రజల కోసమే నేనున్నానని మనసావాచా భావించాలి! అనేది నాయకుల ప్రధాన లక్షణంగా ఉండాలని కలాం కోరుకున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంతో పోల్చుకుంటే.. గడిచిన ఏడాదిన్నరగా ఏపీలో జరుగుతున్న పాలన కలాం భావాలకు.. పోతన తాత్వికతకు అద్దం పడుతోందనేది విశ్లేషకుల భావన. కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు ప్రస్తుత జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, తీసుకువస్తున్న వినూత్న కార్యక్రమాలను గమనిస్తే.. ఎవరికైనా ఇది నిజమని అనిపించకపోదని అంటున్నారు.
అందరూ నావాళ్లే అంటూ.. అధికారంలోకి వచ్చినా.. కొందరిని మాత్రమే తమ వాళ్లుగా భావించే నాయకులు పాలించిన కాలం నుంచి, అందరినీ తనవాళ్లుగా భావించే నాయకుడున్న పాలనకు ఏపీ ఎదిగిందనేది విశ్లేషకుల అంతరార్థం. అనేక పథకాలు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు.. ఏడాదిన్నర వ్యవధిలో ఎన్నెన్ని రూపాల్లో.. ఎన్నెన్ని సాయాలో.. లెక్కపెట్టడం కష్టమే అనే పరిస్థితికి చేరుకున్న వైనం నిజంగా జగన్ పాలనను చూసిన వారికి అనిపించకుండా ఉంటుందా?! ``ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలని అనుకుంటారు!?`` అన్న నాయకులను, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలను మనం చూశాం. కానీ, అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటూ.. అదే ఎస్సీల ఆత్మగౌరవానికి పునాదులు వేస్తున్న నాయకుడు మాత్రం జగన్‌లోనే కనిపిస్తున్నాడనేది ఆయా వర్గాల మాట!
ఆసరా, చేయూత పథకాలు ఈ ఏడాది కొత్తగా అమలవుతున్నాయి. దీంతో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెందిన సంక్షేమంపై పెడుతున్న ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఇక, వైఎస్సార్ ఆసరా కింద కనీసం 25లక్షల మంది మహిళలకు.. వైఎస్సార్ చేయూత కింద దాదాపు 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలనే ఉక్కుసంకల్పంతో జగన్ ముందుకు సాగుతున్నవైనం నభూతో.. అని అనకుండా ఉండగలమా? ఈ పథకాల ద్వారా ఆయా వర్గాల మహిళల ఆర్థిక స్థోమత.. జీవన ప్రమాణాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు. కేవలం వీరికేనా.. అంటే.. కాదు.. సమాజంలోని అన్నివర్గాలు, అన్నివర్ణాల వారికీ ప్రభుత్వం అనేకానేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నతీరు చూస్తే.. ``.... సర్వము తానె అయిన వాడెవ్వడు..`` అంటూ పోతనగారి ముక్తాయింపు గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది!! అందుకే.. జగన్ మనసు పెట్టాడు.. మంచి జరగక మానుతుందా!!